High Paid CEO: దేశంలో టెక్కీల వేతనాల విషయం ఎల్లప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. అనుభవం కలిగిన టెక్ ఉద్యోగులకు భారీగానే వేతనాలు ప్రస్తుతం అందుతున్నాయి. అయితే ఫ్రెషర్ల విషయంలో మాత్రం గత దశాబ్ధకాలంగా పెద్ద మార్పులేమీ లేవని తెలిసిందే. అయితే ఈ కంపెనీలకు సారధ్యం వహించే సీఈవోలకు దేశీయ టెక్ కంపెనీలు కోట్లలో చెల్లించుకుంటున్నాయి.
ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవో జీతం ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రికార్డును కాగ్నిజెంట్ CEO రవి కుమార్ సింగిశెట్టి సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం ఆయన సుమారు రూ.186 కోట్లను వేతనంగా అందుకున్నారు. దీంతో భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా రవి రికార్డ్ నెలకొల్పారు. అలాగే కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం రవి కుమార్ గత ఏడాది సుమారు రూ.169.1 కోట్ల విలువైన షేర్లను అందుకున్నారు.

అయితే ఇప్పుడు అందరి మదిలో ఇతర టెక్ కంపెనీలను నడుపుతున్న సీఈవోల వేతనాలు ఎంతనే ఆలోచన మెదులుతోంది. తాజా నివేదికల ప్రకారం దేశీయ టెక్ దిగ్గటం టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ రూ.29.16 కోట్లు అందుకున్నారు. ఇది కంపెనీ ఆదాయంలో 0.012 శాతం. కాగ్నిజెంట్ రవి కుమార్ సింగిశెట్టి పారితోషికం గత ఏడాది కంపెనీ ఆదాయంలో 0.11 శాతంగా నిలిచింది. ఇదే సమయంలో విప్రో మాజీ CEO థియరీ డెలాపోర్టే రూ.83 కోట్లు వేతనంగా పొందగా ఇది ఆదాయంలో 0.089 శాతానికి సమానం.
ఇదే సమయంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ విజయకుమార్ వార్షిక ప్యాకేజీ అక్షరాలా రూ.88 కోట్లుగా ఆదాయంలో 0.085 శాతంగా నిలిచింది. యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లను వార్షిక వేతనంగా అందుకుంటూ కంపెనీ ఆదాయంలో 0.049 శాతం పొందుతున్నారు. ఇక ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ వేతనం రూ.56.4 కోట్లతో ఆదాయంలో 0.037 శాతంగా ఉండగా ఉన్నట్లు వెల్లడైంది. దీంతో భారతీయ టెక్ కంపెనీలకు పనిచేస్తున్న సీఈవోలు భారీగానే పారితోషికం పొందుతున్నట్లు తేలింది.


Click it and Unblock the Notifications