TCS CEO Salary: ప్రస్తుతం ఐటీ సేవల కంపెనీల్లో ఉద్యోగులు తక్కువ వేతన పెంపులు, తగ్గిపోయిన రిక్రూట్మెంట్లతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇదే క్రమంలో ఫ్రెషర్లు ఆపర్లు లేక ఇబ్బందులు పడుతుండగా.. చాలా సార్లు వారు అత్యంత తక్కువ వేతన ఆఫర్లను పొందుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సీఈవోలకు అధిక వేతనాల అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దేశంలో చర్చ టాప్ ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ నాయకత్వ పాత్రలోని వారు పొందుతున్న వేతనాలపై పడింది. వీరు కంపెనీ రోజువారీ కార్యకలాపాల నుంచి ఆర్థిక ఆరోగ్యం వరకు అన్ని విషయాలకు బాధ్యతవహిస్తుంటారు. 2023-24కి సంబంధించిన తాజా వార్షిక నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం టీసీఎస్ సీఈవో కె కృతివాసన్ కంపెనీ నుంచి భారీ వేతన ప్యాకెజ్ అందుకుంటున్నట్లు వెల్లడైంది.

గడచిన ఏడాది కృతివాసన్ పరిహారం రూపంలో రూ.25.35 కోట్లను టీసీఎస్ నుంచి అందుకున్నారు. ఇందులో మూల వేతన రూ.1.27 కోట్లుగా ఉంది. అంటే నెలవారీ జీతం రూ.10.6 లక్షలుగా ఉంది. ఇదే క్రమంలో ప్రయోజనాలు, అలవెన్సులు రూ.3.08 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. మిగిలిన రూ.21 కోట్లు పనితీరు ఆధారంగా చెల్లించే కమిషన్ రూపంలో అందుకున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి రాజేష్ గోపీనాథన్ కంపెనీ MD, CEO పదవికి రాజీనామా చేసిన తర్వాత జూన్ 1, 2023న టీసీఎస్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కృతివాసన్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం కృతివాసన్ అందుకున్న వేతనం గత సీఈవో గోపీనాథన్ చివరిగా అందుకున్న రూ.29.16 కోట్ల కంటే తక్కువగా ఉంది. మేలో పదవీ విరమణ చేయనున్న టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.26.18 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. కంపెనీ FY24లో ఉద్యోగుల మధ్యస్థ వేతనంలో పెరుగుదల శాతం 10.8 శాతం ఉంది. భారతదేశంలోని TCS ఉద్యోగులకు సగటు వార్షిక జీతం పెరుగుదల 5.5 శాతం నుంచి 8 శాతం వరకు ఉంది. పనిలో అత్యుత్తమ పనితీరు కనబరిచే ఉద్యోగులకు మాత్రం రెండంకెల వేతన పెంపును అందుకున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టీసీఎస్ మెుత్తంగా 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications