దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS)లో 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉద్యోగులు 5 లక్షలు దాటారు. ఈ కంపెనీలో మొదటి త్రైమాసికంలో ఉద్యోగులు 20వేలకు పైగా చేరడంతో హెడ్ కౌంట్ 509,058కు చేరుకుంది. 'టీసీఎస్ కొత్త రికార్డును అందుకుంది. తొలి త్రైమాసికంలో ఉద్యోగులు 5,00,000 దాటారు.
అంతర్జాతీయంగా తాము బెస్ట్ టాలెంట్‌ను తీసుకుంటూనే ఉంటాం. ఈ త్రైమాసికంలో 20,409 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకున్నాం' అని టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ అన్నారు. గత అయిదేళ్లుగా మేజర్ మార్కెట్‌లలో అంటే వివిధ దేశాల్లో స్థానిక నియామకాలు పెంచినట్లు తెలిపారు.

కరోనా ప్రభావం తక్కువ
అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాల నేపథ్యంలో భారత ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానిక నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యంతో పాటు ఇతర మార్కెట్లలోను ఇదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. తాము స్థానిక ఉద్యోగులను నియమించుకున్న నేపథ్యంలో కరోనా సమయంలో ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ వ్యాపారంపై ఎక్కువ ప్రభావం పడలేదని లక్కడ్ అన్నారు.

కొత్త సాంకేతిక పరిజ్ఞానం
తమకు ఉన్న వర్క్ ఫోర్స్‌తో తాము అన్ని విధాలుగా తమ కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని సీఈవో రాజేష్ గోపినాథన్ అన్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. FY22 మొదటి త్రైమాసికంలో ఉద్యోగులు 10 మిలియన్లకు పైగా లెర్నింగ్ హవర్స్ నిర్వహించామని, 407,000 మంది ఉద్యోగులు బహుళ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చామని తెలిపారు.

40,000 మందిని
టీసీఎస్ గత ఏడాది క్యాంపస్ నుండి 40,000 మంది ఉద్యోగులను తీసుకుంది. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికాలో 2000 మంది ఉద్యోగులను తీసుకుంది. అక్కడ కూడా ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మందిని తీసుకోనుంది. లాటిన్ అమెరికాలోను ఇలాగే ఉంది.


Click it and Unblock the Notifications