TCS News: టెక్ ఉద్యోగులు చాలా కాలంగా తమ రంగంలోని ఉద్యోగ అవకాశాలు కొరవడటంపై ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు దాదాపు 2 రెండేళ్లుగా దిగజారుతూనే ఉన్నాయి. అది ప్రస్తుతం హైరింగ్ నిలిపివేతలకు దారితీసింది. దీనికి తోడు భారతీయ టెక్ కంపెనీలు ప్రస్తుతం ఏఐ వినియోగం దిశగా అడుగులువేస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ శుభవార్త చెప్పింది. గతవారం కంపెనీ ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నియామకాలపై స్పష్టతను సీఈవో కృతివాసన్ ఇస్తూ.. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.

కంపెనీ గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లను అందించిన సంగతి తెలిసిందే. ఇవి పొందిన వారందరికీ తప్పకుండా ఉద్యోగాలు కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కృతివాసన్ ప్రకటించారు. కళాశాలల్లో ఎంపికైన ట్రైనీలు కంపెనీ అంతర్గతంగా నిర్వహించే 6-8 నెలల శిక్షణ తర్వాత వాస్తవ పనిలోనికి అడుగుపెడతారని చెప్పారు. నియామకాలు చేపట్టిన సమయానికి, ఎంపికైన విద్యార్థులు ప్రాజెక్టుల్లో చేరే సమయానికి మధ్య అంతరం ఉంటుంది. అందువల్ల సిబ్బంది సంఖ్య తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని సీఈవో వెల్లడించారు.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ అట్రిషన్ రేటు గత త్రైమాసికంలో 13.3 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగుల సంఖ్య 1759 తగ్గటంతో ప్రస్తుతం హెడ్ కౌంట్ 6,03,305గా ఉన్నట్లు కంపెనీ తన త్రైమాసిక ఫలితాల సమయంలో వెల్లడించింది.
తాజాగా సీఈవో కృతివాసన్ దాదాపు 6 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా కీలకమైన విషయాలను వెల్లడించారు. ముందుగా నాలుగో త్రైమాసికంలో అత్యుత్తమ పనితీరు సాధించటానికి దోహదపడిన్న మెుత్తం ఉద్యోగులందరినీ ప్రశంశించారు. కంపెనీ రానున్న కాలంలో అవసరాలకు అనుగుణంగా ఏఐ సాంకేతికలపై పట్టు ఉండేలా ఉద్యోగులను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గడచిన త్రైమాసికంలో చాలా మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ దాదాపు 200 ఏఐ ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications