Income Tax News: ఆదాయపు పన్నుశాఖ నుంచి పలువురు ట్యాక్స్ పేయర్స్ కు నోటీసులు వెళ్లడం సర్వసాధారణం. అధిక విలువ కలిగిన లావాదేవీలను చూపించకపోవడం, చెల్లించాల్సిన దానికంటే తక్కువ పే చేయడం వంటి పలు కారణాలవల్ల IT విభాగం సదరు పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపుతూ ఉంటుంది. అయితే కావాలని చేయకపోయినా ఒక్కోసారి ఆ శాఖ చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దదిగా చేసి పౌరులను ఇబ్బందులకు గురిచేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దానికి ఈ ఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు.
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన అపూర్వ జైన్ అనే వ్యక్తి తనకు జరిగిన సంఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి తనకు నోటీస్ అందినట్లు పేర్కొన్నారు. దానికి తాను ఓ CAను నియమించుకుని సదరు నోటీసుకు సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవడానికి ఆ CAకు తాను 50 వేలు చెల్లించినట్లు వివరించారు. చివరకు IT విభాగం హైలెట్ చేసిన పన్ను అమౌంట్ లో తేడా కేవలం ఒక్క రూపాయని తెలిసి షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ఆదాయపు పన్ను శాఖ కూడా స్పందించడంతో అపూర్వ జైన్ ధీటుగా బదులిచ్చారు. IT విభాగం వివరణ తనకు ఏ మాత్రం ఉపయోగపడదని కౌంటర్ ఇచ్చారు. అర్థంకాని రూల్స్ తో పన్ను చెల్లింపుదారులను క్రిమినల్స్ గా చూపించే వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెల్లించిన 50 వేలకు, వెచ్చించిన సమయానికి ఆదాయపన్ను శాఖ నష్టపరిహారం చెల్లించగలదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అందరికీ అర్థమయ్యే విధంగా తమ నియమ నిబంధనలను మార్చాలని సూచించారు.
ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. పన్ను నిబంధనలు చాలా కష్టంగా ఉంటున్నాయని, అర్థం చేసుకోవడం కష్టతరం అవుతుందని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. మరికొందరు అపూర్వ జైన్ జోక్ చేస్తున్నాడని కామెంట్స్ చేశారు. అయితే వాటికి ఆయన తిరిగి సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా వాస్తవమేనని, ఇలా మరొకరికి జరగకూడదనే తన అనుభవాన్ని ఇతరులకు తెలియజేయాలని ఉద్దేశంతోనే పోస్ట్ పెట్టినట్లు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications