IT Returns: ఆదాయపుపన్ను అధికారులు రిటర్న్స్ వెరిఫై చేసేందుకు నూతన ఏఐ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చారు. విరాళాల పేరుతో పన్ను ఎగవేతలకు పాల్పడుతున్న అనేక మందికి నోటీసులు పంపుతున్నారు.
తాజాగా అధికారులు FY19కి సంబంధించిన అనేక ఆదాయపు పన్ను రిటర్న్‌లను తిరిగి అంచనా(Reasses) వేస్తున్నారు. ఆ సమయంలో ఛారిటబుల్ ట్రస్టులు, రాజకీయ పార్టీలకు చేసిన విరాళాలను క్లెయిమ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఆదాయం కంటే చేసిన విరాళాలు ఎక్కువగా ఉంటూ పొంతనలేని రిటర్న్స్ చేసిన వ్యక్తులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి గుర్తించిన టాక్స్ అధికారులు ఇప్పుడు నోటీసులు పంపుతున్నారు.

ఈ క్రమంలో 2023లో మార్చి 20 నుంచి జూన్ 10 మధ్య కాలంలో వందల మంది జీతం పొందే ఉద్యోగులకు (salaried individuals)కి పన్ను అధికారులు నోటీసులు పంపినట్లు చార్టెడ్ అకౌంటెంట్స్ చెబుతున్నారు. వ్యక్తులు రాజకీయ పార్టీలు లేదా ట్రస్టులకు చేసే విరాళాలను ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్-80G కింద 50-100 శాతం వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ క్రమంలో సెక్షన్ 138, 148 (ఎ) కింద కొందరికి పన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు. చాలా సందర్భాల్లో నోటీసులో డిడక్షన్లలో పొరపాట్ల గురించి అధికారులు లేవనెత్తారు. కానీ ఎక్కువ మొత్తంలో విరాళం క్లెయిమ్ చేయబడిన కొన్ని సందర్భాల్లో రీఅసెస్‌మెంట్ నోటీసు పంపబడింది. ఒకసారి అసెస్మెంట్ పూర్తైన రిటర్న్ లకు పదేళ్లలోపు ఎప్పుడైనా రీఅసెస్‌మెంట్ నోటీసులు పంపే అధికారం టాక్స్ ఆఫీసర్లకు ఉంటుంది. రూ.50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి మాత్రమే 8 ఏళ్లలోపు ఎప్పుడైనా ఈ నోటీసులను జారీ చేయవచ్చు.
ఈ క్రమంలో పన్ను అధికారులు రిటర్న్ దాఖలు చేసిన వ్యక్తి చూపుతున్న డొనేషన్ మెుత్తాన్ని సదరు పొలిటికల్ పార్టీ లేదా ఛారిటబుల్ ట్రస్ట్ టాక్స్ రిటర్స్ వివరాలతో పోల్చి చూస్తారు. దీని ద్వారా అందించిన వివరాలు నిజమైనవా లేక తప్పుడువా అని రీఅసెస్‌మెంట్ లో తనిఖీ చేస్తారు. అందువల్ల ఒకవేళ మీరు ఇలాంటి నోటీసులను అందుకున్నట్లయితే వాటికి తప్పకుండా బదులివ్వాల్సి ఉంటుంది. నిజమని నిరూపించుకోలేక పోతే వారికి 50 నుంచి 200 శాతం వరకు పెనాల్టీలు విధించబడతాయి.


Click it and Unblock the Notifications