మూడోసారి.. మళ్లీ వాహనాల ధరలు పెరుగుతున్నాయ్: వచ్చే వారం టాటా మోటార్స్ ధరల పెంపు
వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే త్వరపడండి! త్వరలో మరోసారి వివిధ ఆటో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించాయి. మరిన్ని కంపెనీలు అదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంజ్ పాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ (PVBU) శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే ఇన్‌పుట్ ఖర్చులు భారీగా పెరిగాయని, కస్టమర్లపై కాస్త భారం తప్పడం లేదని తెలిపారు.

రెవెన్యూపై ప్రభావం
వచ్చే వారం నుండి అంటే ఆగస్ట్ మొదటి వారం నుండి అన్ని రకాల పాసింజర్ వాహనాల ధరలను పెంచాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. స్టీల్, ఇతర విలువైన ఎసెన్షియల్ మెటిరీయల్ ధరలు పెరిగాయని, దీంతో కంపెనీలపై భారం పడుతోందని, ఇందులో కొంత మొత్తం కస్టమర్ల పైకి మరల్చుతున్నట్లు తెలిపారు.
ముంబై ప్రధాన కార్యాలయం కలిగిన టాటా మోటార్స్ టియాగో, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి పాసింజర్ వాహనాలను డొమెస్టిక్ మార్కెట్లో విక్రయిస్తోంది. గత ఏడాది కాలంలో ఉక్కు, విలువైన లోహాల ధరలు భారీగా పెరిగాయని, దీంతో ఈ ప్రభావం ఆదాయంపై 8 శాతం నుండి 8.5 శాతం పడిందని శైలేంద్ర చంద్ర తెలిపారు.

కేవలం కొద్ది భారమే
కస్టమర్ల పైన తాము తక్కువ భారం మాత్రమే మోపుతున్నామని తెలిపారు. కంపెనీ రియలైజేషన్ ప్రాస్పెక్టివ్ నుండి ఈ భారం 2.5 శాతమని, ఎక్స్-షోరూం ధర ప్రకారం ఇది మూడు శాతం మాత్రమేనని తెలిపారు. అధిక వ్యయ భారం తగ్గించుకునేందుకు కంపెనీ వివిధ చర్యలు చేపడుతోందని తెలిపారు. అయితే అంతరం ఇంకా ఉండటంతో కస్టమర్లపై కాస్త భారం మోపుతున్నామన్నారు.

50 శాతం పెంపు
ఇటీవలి కొద్ది నెలల్లోనే వాహనాల ధరలు పలుమార్లు పెరిగాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే రెండుసార్లు పెంచాయి. ఇప్పుడు మరోసారి పెంపుకు సిద్ధమయ్యాయి. ముడి పదార్థాల వ్యయాలు భారీగా పెరగడం ఇందుకు నేపథ్యం. గత తొమ్మిది నెలల్లో ఉక్కు ధరలు 50 శాతం మేర పెరిగాయి. దీంతో కంపెనీలు ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు రెండుసార్లు ధరలను పెంచాయి. జూన్ త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు తగ్గుతాయనే అంచనాలు తల్లకిందులవ్వడంతో, ధరలను మళ్లీ పెంచక తప్పదని చెబుతున్నాయి.

వడ్డీ రేట్లు తక్కువ
డిమాండ్ ధోరణిని బట్టి బైక్ కంపెనీలు ధరలపై ఓ నిర్ణయానికి వస్తాయని భావిస్తున్నారు. గతంలో కంపెనీలు వివిధ సందర్భాల్లో ధరలు పెంచాయని, ముడి పదార్థాల ధరలు పెరిగినపుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టినప్పుడు, జీఎస్టీ పెరిగినపుడు ఇలా డిమాండ్‌తో సంబంధం లేకుండా పెంచాయని గుర్తు చేస్తున్నారు. డిమాండ్ తక్కువగా ఉన్నా అదే పని చేయవచ్చునని అంటున్నారు. పైగా బ్యాంకుల రుణ వడ్డీ రేట్లు అత్యంత కనిష్ఠస్థాయిల్లో ఉండటం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications