భారత్‌కు పాకిస్తాన్ పెట్రోల్ అమ్మే రోజు వస్తుంది.. ఇండియాపై ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
భారత్ మిత్ర దేశం అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసును తీవ్రంగా వెళ్లగక్కుతున్నాడు. 25 శాతం సుంకాలతోపాటు రష్యాతో భారత్ వాణిజ్యం జరిపితే జరిమానాలు తప్పవని కూడా హెచ్చరించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే మన శత్రుదేశం పాకిస్థాన్‌తో స్నేహానికి చేతులు చాచారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు ట్రూత్ వేదికగా వెల్లడించారు. పాక్‌తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరిందని..భారత్‌కు పాకిస్థాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని చెప్పుకొచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య వాతావరణం ఇప్పటికే ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఇప్పుడు ఈ వేడికి ఆజ్యం పోసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో పాకిస్తాన్ భారత్‌కు చమురు అమ్మే అవకాశం ఉంది. ఇందుకోసం అమెరికా పాకిస్తాన్‌కు సహకరిస్తుందంటూ పోస్ట్ చేశారు.

ట్రంప్ ప్రకటన ప్రకారం.. పాకిస్తాన్‌తో ఒక డీల్ కుదుర్చుకున్నామని.. ఈ ఒప్పందం ద్వారా చమురు నిల్వల అభివృద్ధిలో పాకిస్తాన్-అమెరికా కలిసి పనిచేయనున్నాయని చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టుకు ఏ సంస్థ నాయకత్వం వహించాలి అనేది ఇంకా డిసైడ్ కాలేదని కూడా తెలిపారు.అలాగే దక్షిణ కొరియా ప్రతినిధులతో వాణిజ్య చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అక్కడ కూడా 25 శాతం టారిఫ్‌ల విషయంపై చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు. దేశ వాణిజ్య లోటును తగ్గించేందుకు, కొన్ని దేశాలు తమవైపు నుండి టారిఫ్ తగ్గింపుల ప్రతిపాదనలు ఇస్తున్నాయని తెలిపారు.
భారతదేశంపై విధించబోయే 25 శాతం సుంకాల విషయంలో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని..ఈ వారాంతానికి వాటిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, భారత్‌మిత్రదేశం అయినా సరే.. సాంకేతికంగా తక్కువ ధరలకు అంతర్జాతీయ వ్యాపారం జరిగే రోజులు పోయాయని ట్రంప్ తేల్చి చెప్పారు. దాయాది దేశం ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో తమ భాగస్వామ్యం కొనసాగేందుకు ఉపయోగపడుతుందన్నారు.
టారిఫ్‌లు ప్రకటించిన వెంటనే ట్రంప్ బ్రిక్స్ దేశాలపై మండిపడ్డారు. యూఎస్‌కు వ్యతిరేకంగా, డాలర్‌ను అణగదొక్కాలని బ్రిక్స్ దేశాలు చూస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ కూడా ఆ కూటమిలో భాగంగా ఉందని బ్రిక్స్ దేశాల ఆటలు సాగనివ్వమని తేల్చి చెప్పారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత్ తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మోదీ సర్కారు స్పష్టం చేసింది.
భారత్.. రష్యాతో పెంచుకుంటున్న వ్యాపార సంబంధాలు, ముఖ్యంగా ఆయుధాలు, ఇంధన దిగుమతులే డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తికి కారణమవుతున్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తుండగా ఇండియా మాత్రం తన స్వంత ఆర్థిక, భద్రతా అవసరాల దృష్ట్యా రష్యాతో సంబంధాలు కొనసాగిస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మనమంతా రష్యాను ఒంటరిగా చేసి..ఆ దేశంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ భారత్, చైనా వంటి దేశాలు రష్యాతో చమురు, ఆయుధ వ్యాపారాలను మరింతగా పెంచుకుంటున్నాయి. ఈ తీరుతో మన లక్ష్యాలు నెరవేరడం లేదని అన్నారు.ఇందులో భాగంగానే ట్రంప్ భారతదేశంపై 25 శాతం దిగుమతి సుంకాలు, అదనపు జరిమానాలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications