Act fibernet: చేతులు మారనున్న బ్రాడ్‌బ్యాండ్ కంపెనీ: 7000 మందికి పైగా ఎంప్లాయిస్‌తో
బెంగళూరు: సిలికాన్ సిటీ బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఆట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (ACT Fibernet) ఇక చేతులు మారనుంది. కంపెనీలో తన ప్రధాన, మెజారిటీ వాటాను కోల్పోనుంది యాజమాన్యం. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కంపెనీ పార్ట్‌నర్స్ గ్రూప్ ఇందులో పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టబోతోంది. మెజారిటీ స్టేక్‌ను కొనుగోలు చేయనుంది. ఫలితంగా- యాక్ట్ ఫైబర్ నెట్ కంపెనీ ఇక స్విట్జర్లాండ్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ చేతుల్లోకి వెళ్తుంది.
యాక్ట్ ఫైబర్ నెట్ గురించి తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో ఈ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. జాయింట్ వెంచర్ కింద ఏర్పాటైన సంస్థ ఇది. తన వాటాను పెంచుకోనుంది పార్ట్‌నర్స్ గ్రూప్. 75 శాతం మేర వాటాలను కొనుగోలు చేయనుంది. దీని విలువ 1.2 బిలియన్ డాలర్లు.. మన దేశీయ కరెన్సీలో ఆరున్నర వేల కోట్ల రూపాయలు పైమాటే.

2008లో ట్రూనార్త్ ఫండ్ సంస్థ.. యాక్ట్ ఫైబర్ నెట్‌లో మెజారిటీ స్టేక్స్‌ను కొనుగోలు చేసింది. సుమారు ఎనిమిదేళ్ల పాటు ట్రూనార్త్ ఫండ్ చేతిలో కొనసాగిందీ కంపెనీ. 2016లో ఇండియమ్ వీ (మారిషస్) హోల్డింగ్స్ నేతృత్వంలోని కన్సార్టియం అర్గాన్, టీఏల ద్వారా ఇందులో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. దాని తరువాత ఇక దశలవారీగా యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థ తన కార్యకలాపాలు విస్తరించుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు ఇంటర్‌నెట్, టీవీ, డేటాలను అందిస్తూ వస్తోంది.
దేశవ్యాప్తంగా 19 నగరాల్లో యాక్ట్ ఫైబర్‌నెట్‌కు మెజారీటీ వినియోగదారులు ఉన్నారు. ఈ వినియోగదారుల సంఖ్య 20 లక్షలకు పైమాటే. దేశంలో నాలుగో అతిపెద్ద వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఆవిర్భవించింది. 2008 నుంచి తన ఆదాయాన్ని క్రమం తప్పకుండా పెంచుకుంటూ వస్తోన్నామని, ఇక దాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ పార్ట్‌నర్స్ గ్రూప్ తన వాటాలను పెంచుకుందని యాక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలా మల్లాది తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తోన్న లాక్‌డౌన్ వల్ల కోట్లాదిమంది ఉద్యోగులు ఇళ్ల నుంచే తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తోన్నారని, వారి ఇంటర్‌నెట్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ తన సేవలు, డేటా స్పీడ్ కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చిదని పేర్కొన్నారు. పార్ట్‌నర్స్ గ్రూప్ చేతుల్లోకి కంపెనీ వెళ్లిన తరువాత తమ సేవలను మరింత పురోగమిస్తాయని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications