కరోనా వైరస్ నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్ తో ఆర్ధిక రంగం ఊహించని విధంగా పతనమైంది . ముఖ్యంగా ఐటీ కంపెనీలు బాగా దెబ్బ తిన్నాయి. చాలా కంపెనీలు అసలు కంపెనీలను నడిపించలేని స్థితికి చేరుకున్నాయి. విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా సాఫ్ట్‌వేర్, స్టార్టప్ కంపెనీల పరిస్థితి ఎలా ఉంది. స్టార్టప్ కంపెనీలు తిరిగి మనుగడ సాగిస్తాయా ? అన్న అంశాలపై నాస్కామ్ సర్వే నిర్వహించింది. ఇక ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి.

250 స్టార్టప్ కంపెనీలపై సర్వే చేసిన నాస్కామ్
కరోనా వైరస్ దెబ్బతో స్టార్టప్ కంపెనీలు విలవిలలాడుతున్నాయి. సరికొత్త ఇన్నోవేటివ్ ఆలోచనలతో చాలా మంది టెక్నాలజీని నమ్ముకుని స్టార్టప్ కంపెనీలు పెట్టారు. ఇక అలా ప్రారంభం అయిన ఈ కంపెనీల్లో చాలావరకు ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఐటీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే ‘నాస్కామ్' జరిపిన ఒక సర్వేలో ఈ విషయంతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ సర్వే 250 స్టార్టప్ కంపెనీల మీద చేసింది.

40 శాతం స్టార్టప్ కంపెనీలు మూతపడే అవకాశం
సర్వేలో పాల్గొన్న 250 స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల్లో 92 శాతం మంది కరోనా లాక్ డౌన్ దెబ్బకు తమ ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. ఆదాయాలు 40 శాతం పడిపోయాయని 62 శాతం మంది పేర్కొన్నారు. ఇక 32 శాతం మంది తమ స్టార్టప్ కంపెనీల ఆదాయం 80 శాతానికిపైగా పడిపోయిందని చెప్పారు. ఇక దీంతో దాదాపు 40 శాతం స్టార్టప్ కంపెనీలు తమ వ్యాపారాల్ని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా మూసివేసే పరిస్థితుల్లో ఉన్నాయని నాస్కామ్ తెలిపింది.

కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీలతో పాటు హెల్త్‌కేర్ వ్యాపారంపై దృష్టి
ఇక కరోనా లాక్ డౌన్ దెబ్బతో స్టార్టప్ కంపెనీలు నిర్వహించే చాలా వ్యాపారాల మీద దెబ్బ పడింది. ఇక ఇప్పుడు మనుగడ సాగించటానికి కొత్త వ్యాపారాల ఆలోచన చేస్తున్నాయి స్టార్టప్ కంపెనీలు . కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్ వంటి కొత్త టెక్నాలజీలతో పాటు హెల్త్‌కేర్ వ్యాపారం ఇప్పుడు ఈ కంపెనీలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని కూడా సర్వేలో తేలింది. ప్రస్తుతం స్టార్టప్ కంపెనీల పరిస్థితి చూస్తే 70 శాతం స్టార్టప్ కంపెనీల వద్ద మూడు నెలల అవసరాలకు మించి నిధులు లేవు. ఇక కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది .

ఖర్చులు తగ్గించుకునే పనిలో స్టార్టప్ కంపెనీలు
ఖర్చులు తగ్గించుకునేందుకు జీతాల తగ్గింపు లేదా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలను తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఖర్చు తగ్గించుకునే ప్రతి మార్గాన్ని ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఇక కొత్త నియామకాల నిలిపివేయటమే కాకుండా సమర్ధులుగా ఉన్నవారికే ఎక్కువ పని భారం అప్పగించి కాస్ట్ కటింగ్ చెయ్యాలని భావిస్తున్నారు . ఇక సంస్థకు రావాల్సిన బకాయిల వసూలులో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక కొన్ని సంస్థలకు లాక్‌డౌన్‌తో మానవ వనరుల కొరత ఏర్పడింది.


Click it and Unblock the Notifications