srilanka: పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దివాళా తీసిన విషయం తెలిసిందే. తదనంతరం జరిగిన ఆర్థిక, రాజకీయ పరిణామాలూ విధితమే. కరెంటు కష్టాలతో ఆ దేశీయులు ఇప్పటికే చీకటిలో మగ్గుతున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలపై మరో బాంబు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరవకపోతే గడవని పరిస్థితి ఏర్పడింది.

గతేడాది 75 శాతం, ఇప్పుడేమో:
అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణ సహాయం పొందినందుకు గాను.. మరోసారి విద్యుత్ ఛార్జీలను పెంచనున్నట్లు శ్రీలంక మంత్రి తెలిపారు. గతేడాది 75 శాతం విద్యుత్ ఛార్జీలను వడ్డించిన లంక ప్రభుత్వం, ఇప్పుడు 66 శాతం మేర మరోసారి భారం మోపేందుకు సిద్ధమవుతోంది. గతనెల జనవరిలో ద్రవ్యోల్బణం 54 శాతానికి పైగా పెరగ్గా, 36 శాతం వరకు ఆదాయపు పన్నులు విధిస్తున్నారు.

కష్టమే కానీ తప్పదు:
"విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయం ప్రజలకు కష్టంగా ఉంటుందని తెలుసు. కానీ తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వస్తోంది. IMF నుంచి సాయం పొందినందు వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. జూలైలో మరోసారి సమీక్షించి, ధరలను సవరిస్తాం. తద్వారా ప్రజలపై కొంత భారం తగ్గవచ్చు" అని లంక విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర స్పష్టం చేశారు.

మరింతగా ద్రవ్యోల్బణం:
రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు, IMF గతేడాది సెప్టెంబర్‌లో 2.9 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చింది. పన్నులు పెంచడం, సబ్సిడీలను తొలగించడం వంటి వివిధ షరతులకు ప్రభుత్వ అంగీకరించడం ద్వారా ఈ అప్పు తెచ్చుకోగలిగింది. ప్రస్తుతం పాకిస్థాన్ కు సైతం దాదాపు ఇదే తరహా షరతులను IMF విధించింది. అయితే ఈ ధరల పెంపు లంకలో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్-శ్రీలంక విద్యుత్ గ్రిడ్:
భవిష్యత్తులో విద్యుత్ ఇబ్బందులను అధిగమించడానికి ఇండియాతో ఒప్పందంపై సంతకం చేసినట్లు శ్రీలంక దౌత్యవేత్త మిలిందా మొరగోడ వెల్లడించారు. ఇరు దేశాల పవర్ గ్రిడ్ లను అనుసంధానించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే భారత్ 4 బిలియన్ డాలర్ల సహాయం అందించినట్లు గుర్తు చేశారు. పర్యాటకం, పెట్టుబడులు, ఏకీకరణ దిశగా ఇండియాతో కలిసి ముందుకు సాగుతామన్నారు. లంకలో ఉత్పత్తి కానున్న పునరుత్పాదక శక్తిని భారత్ కు విక్రయించేందుకు వీలుగా.. 3 ఏళ్లలో ట్రాన్స్ మిషన్ లైన్ ను ఏర్పాటు చేయాలని ఆ దేశం భావిస్తోంది.


Click it and Unblock the Notifications