శ్రీలంక భారీ ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. నిత్యావసర ధరలు అమాంతం ఎగిసిపడ్డాయి. పెరిగిన ధరలతో కొనుగోలు చేయడానికి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టారీతిన అప్పులు, ప్రణాళిక లేని ఆర్గానిక్ వ్యవసాయం, ప్రత్యేకించి డ్రాగన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు శ్రీలంకను అప్పుల ఊబిలోకి, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేశాయి. అయితే భారత్ ఆపన్న హస్తం అందించింది. శ్రీలంక ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంక స్టాక్ ఎక్స్చేంజ్ కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుండి ఐదు రోజులు ఎక్స్చేంజీ నిలిచిపోనుంది.

ఎక్స్చేంజీ నిలిపివేత
ఈ వారం స్టాక్ ఎక్స్చేంజీని నిలిపివేయాలని శ్రీలంక సెక్యూరిటీ కమిషన్ కొలంబో స్టాక్ ఎక్స్చేంజీని ఆదేశించింది. చాలాకాలంగా లంక ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉండటంతో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, జీర్ణించుకోవడానికి ఇన్వెస్టర్లకు సమయం ఇవ్వాలని, అందుకే వారం పాటు నిలిపివేయాలని ఆదేశించింది. స్టాక్ ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఇతర స్టేక్ హోల్డర్లు తాత్కాలిక నిలిపివేత కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ శ్రీలంకకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కమిషన్ వెల్లడించింది.

గమనిస్తున్నారు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ పరిస్థితులను గమనిస్తున్నారని, దేశంలోని ప్రస్తుత పరిస్థితి స్టాక్ మార్కెట్ పైన చూపించే ప్రభావాన్ని అంచనా వేస్తోందని, ప్రత్యేకించి సెక్యూరిటీస్ ట్రేడింగ్ కోసం క్రమబద్దమైన, న్యాయమైన మార్కెట్‌ను నిర్వహించకల సామర్థ్యాన్ని అంచనా వేస్తోందని చెబుతున్నారు.

అప్పు మీద అప్పు
శ్రీలంక ప్రతినిధి బృందం వాషింగ్టన్ వెళ్తోంది. ఆహారం, ఇంధన దిగుమతులకు చెల్లింపుల కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి 4 బిలియన్ డాలర్ల వరకు తీసుకోవాలని చూస్తోంది. 81 బిలియన్ డాలర్ల ఎకానమి 8.6 బిలియన్ డాలర్ల రుణ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇది కూడా ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కంటే ముందు మాత్రమే.


Click it and Unblock the Notifications