లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్ స్పైస్ జెట్ తమ పైలట్‌లకు షాకిచ్చింది. ఏప్రిల్, మే నెలలకు గాను వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని సమాచారం అందించింది. అయితే తమ పైలట్లకు కొందరికి ఓ అవకాశం కల్పిస్తోంది. తమ పైలట్లు కనీస వేతనం పొందేలా కార్గో విమానాలు నడిపించే సౌకర్యం కల్పిస్తోంది. కార్గో విమానాలు నడిపే పైలట్లు ప్రతి గంటకు వేతనం తీసుకుంటారు. కరోనా కారణంగా అతి ఎక్కువగా ప్రభావం పడింది ఎయిర్ లైన్స్, ఆతిథ్య రంగం పైనే.

అత్యవసర సేవలకు విమానాలు
స్పైస్ జెట్ ఐదు సరుకు రవాణా విమానాలను కలిగి ఉంది. ఇవి ప్రస్తుతం భారత్, విదేశాల్లో వైద్య, ఆహార సామాగ్రి వంటి సరుకును రవాణా చేస్తున్నాయి. అదనంగా సరుకు రవాణా కోసం పాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ బోయింగ్ 737, Q400 లను కూడా మోహరించింది. వీటిని నడిపే పైలట్లకు గంట చొప్పున వేతనాలు కట్టిస్తోంది.

మనకు వేతనాలు లభించవు
ఈ ఏప్రిల్, మే నెలలకు గాను మనకు ఎలాంటి వేతనం లభించదని, రాబోయే వారాల్లో సరకు రవాణా చేసే విమానాల సంఖ్యను మరిన్ని పెంచాలని భావిస్తున్నామని స్పైస్ జెట్ విమానయాన సంస్థ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ గుర్చరన్ అరోరా.. పైలట్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మన టీం అందరికీ ఎయిర్ క్రాఫ్ట్ నడిపే అవకాశం వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తోందని, ప్రతి పైలట్‌కు కొంత సమయం మాత్రమే అవకాశం దొరుకుతుందని, దీంతో మన నైపుణ్యం చెక్కుచెదరకుండా ఉంటుందని పేర్కొన్నారు.

తాజా ఆఫర్ ప్రకారం..
స్పైస్ జెట్ క్యాబిన్ క్రూ సిబ్బంది వేతనం 30 శాతం తగ్గించింది. పదోన్నతులు కూడా కఠినతరం చేసింది. ఇదిలా ఉండగా స్పైస్ జెట్ ఇచ్చిన తాజా ఆఫర్ ప్రకారం పైలట్‌కు ప్రతి 25 గంటల చొప్పున చెల్లిస్తుందని తెలుస్తోంది. కరోనాకు ముందు ఫిక్స్డ్ శాలరీ 50 గంటలకు ఉండేదట. అత్యల్ప స్లాబ్ పరంగా నిర్ణీత 50 గంటలకు రూ.36,000 ప్రాథమిక వేతనం ఉండేది. ఇప్పుడు రూ.29,000కు తగ్గిందని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఎక్కువ మంది ఉద్యోగులను వేతనం లేని సెలవులపై పంపించినట్లు స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications