Layoffs: వేతన జీవులకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ఆర్థిక మందగమనం దృష్ట్యా పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధించాయి. కొవిడ్ మహమ్మారితో మొదలైన లేఆఫ్ లు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ షూ మాన్యుఫ్యాక్చరర్ తాజాగా 6 వేల మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
తైవాన్ బేస్డ్ పౌ చెన్ గ్రూపునకు చెందిన పౌయెన్ వియత్నాం తన ఉద్యోగుల్లో 6 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు స్థానిక అధికారులకు తెలియజేసింది. వచ్చే నెల చివరికి ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు వెల్లడించింది. నైక్, అడిడాస్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ఈ సంస్థ షూ తయారీదారుగా వ్యవహిరిస్తోంది. ఆర్డర్‌ల మందగమనమే దీనికి కారణమని పేర్కొంది.

దుస్తులు, పాదరక్షలు మరియు ఫర్నిచర్ ఎగుమతి చేసే దేశాలలో వియత్నాం అతిపెద్దది. కానీ యూరప్, USలో వ్యయ సంక్షోభం కారణంగా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. తద్వారా ఈ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది. 1996లో హె చి మిన్ సిటీలో పౌయెన్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద తొలగింపు కావడం గమనార్హం. కార్మిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గతేడాది వియత్నాంలో 6 లక్షల 30 వేల కార్మికులు ఉద్యోగాలను కోల్పోవడం లేదా పని గంటలు తగ్గించడం జరిగింది.

ఈ సంస్థకు వియత్నాం వాణిజ్య రాజధానిలో 50 వేల మంది కార్మికులు ఉన్నట్లు అంచనా. తద్వారా అక్కడ అతిపెద్ద యాజమాన్య సంస్థగా ప్రసిద్ధి చెందింది. కానీ ఫిబ్రవరిలో దాదాపు 3 వేల మంది శాశ్వత సిబ్బందిని తొలగించింది. మరో 3 వేల మంది తాత్కాలిక ఉద్యోగుల ఒప్పందాలను పునరుద్ధరించలేదు. ఆర్థిక మందగమనం ముఖ్యంగా షూస్, దుస్తులు, నిర్మాణ మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలపై ప్రభావం చూపిందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications