స్టాక్ మార్కెట్లు శుక్రవారం(సెప్టెంబర్ 4) భారీ నష్టాల్లో ముగిశాయి. ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 633.76 పాయింట్లు(1.63%) నష్టపోయి 38,357.18, నిఫ్టీ 193.60 పాయింట్లు(1.68%) క్షీణించి 11,333.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1002 షేర్లు లాభాల్లో, 1674 నష్టాల్లో ముగియగా, 177 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఉదయం ప్రారంభంలోనే 500 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత 450 పాయింట్ల నష్టానికి తగ్గి, చివరకు 634 పాయింట్లు క్షీణించింది. ఎన్ఎస్ఈలో ప్రధాన రంగాలు 3 శాతం నుండి 2 శాతం మేర, మిడ్, స్మాల్ క్యాప్ సంస్థలు 2 శాతం నుండి 1 శాతం మేర నష్టపోయాయి.

మారుతీ సుజుకీ మాత్రమే లాభాల్లో..
టెక్ దిగ్గజాల్లో వెల్లువెత్తిన అమ్మకాలతో గురువారం అమెరికా మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావం శుక్రవారం ఆసియా మార్కెట్లు, దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో ప్రారంభం నుండి చివరి వరకు మార్కెట్లు ఏ దశలోను కోలుకోలేదు. నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీ దిగ్గజాల్లో కేవలం మారుతీ సుజుకీ మాత్రమే లాభపడింది. దాదాపు 2 శాతం మేర లాభపడి రూ.7,210 వద్ద క్లోజ్ అయింది. టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, జీ ఎంటర్టైన్మెంట్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ ఉన్నాయి.

ఈ వారం 3 శాతం క్షీణత
రంగాలవారీగా చూస్తే ఫార్మా, బ్యాంకు, ఇన్ఫ్రా, ఎనర్జీ షేర్లు మూడు శాతం వరకు నష్టపోయాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతానికి పైగా క్షీణించాయి. ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 3 శాతం మేర నష్టపోగా, నిఫ్టీ బ్యాంకు 6 శాతం క్షీణించింది. ఈ వారం నిఫ్టీ బ్యాంకు ఆరు శాతం మేర, మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ స్టాక్స్‌లో 12 మాత్రమే ఈ వారం లాభపడ్డాయి. ఈ వారంలో భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు కరోనా కేసులు తగ్గడం లేదు. నిన్న అమెరికా నాస్‌దాక్ 5 శాతం, డౌజోన్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లు, ఆసియా మార్కెట్లపై పడింది. ఆసియా మార్కెట్లు రెండు వారాల కనిష్టానికి కుంగిపోయాయి. దీంతో భారత మార్కెట్లు నేల చూపులు చూశాయి. దీనికి తోడు చైనాతో సరిహద్దు టెన్షన్ కొనసాగుతోంది. ఇది కూడా మార్కెట్లను దెబ్బతీసింది. దేశంలోను కరోనా కేసులు పెరుగుతున్నాయి. రికవరీ శాతం పెరుగుతున్నప్పటికీ, కరోనా కేసులు నిన్న ప్రపంచ దేశాల్లో మనవద్ద ఎక్కువగా నమోదయ్యాయి.

బలపడిన రూపాయి
రెండు రోజుల పాటు బలహీనపడిన రూపాయి ఈ రోజు లాభాల్లో ముగిసింది. అమెరికా డాలర్ మారకంతో 33 పైసలు లాభపడి 73.14 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 73.38 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 73.01 నుండి 73.47 మధ్య ట్రేడ్ అయింది.
ఇదిలా ఉండగా, గురువారం నగదు విభాగంలో ఇటు FPIలు నామమాత్రంగా రూ.8 కోట్లు, అటు దేశీ ఫండ్స్ DIIలు స్వల్పంగా రూ.120 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం FPIలు దాదాపు రూ.991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, DIIలు రూ.657 కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.


Click it and Unblock the Notifications