SBI గుడ్‌న్యూస్, 14,000 కొత్త ఉద్యోగాలు: వీఆర్ఎస్‌పై క్లారిటీ
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది 14,000 మందిని రిక్రూట్ చేసుకుంటామని వెల్లడించింది. అదే సమయంలో ఉద్యోగుల కోసం రూపొందించిన వీఆర్ఎస్ స్కీం వ్యయ నియంత్రణ ప్రక్రియ కోసం కాదని తేల్చి చెప్పింది. ఎస్బీఐ ఉద్యోగుల ఫ్రెండ్లీ బ్యాంకు అని, కార్యకలాపాలను మరింత విస్తరిస్తుందని సోమవారం తెలిపింది. ఇందుకోసం ఈ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకుంటామని స్పష్టం చేసింది.

ఉద్యోగుల ఫ్రెండ్లీ.. మరింతమందిని తీసుకుంటాం
ఎస్పీఐ ఉద్యోగులకు అనుకూలంగా ఉండే బ్యాంకు అని, ఇది తన కార్యకలాపాలను పెంచుకోవడంతో పాటు ఉద్యోగులను నియమించుకునే ప్లాన్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐలో ప్రస్తుతం 2.50 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల అవసరాలను తీర్చడంలో, వారి జీవన ప్రయాణానికి తోడ్పడటంలో బ్యాంకు ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపింది. ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(VRS) అంశం వెలుగు చూడటంతో ఈ అంశంపై కూడా బ్యాంకు స్పందించింది.

30,000 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్
ఎస్బీఐ VRS పథకాన్ని తేవాలని చూస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 30,000 మందికి పైగా ఉద్యోగులు దీనికి అర్హులుగా ఉన్నారు. కానీ వీఆర్ఎస్ వ్యయ నియంత్రణ కోసం కాదని ఎస్బీఐ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ క్రమంలోనే కొత్తగా 14వేల ఉద్యోగాలను తీసుకు రానున్నట్లు తెలిపింది. బ్యాంకు కార్యకలాపాల విస్తరణకు వెళ్తున్నందున ముందు ముందు మరింత సిబ్బంది అవసరమని తెలిపింది.

వీఆర్ఎస్ ప్రయోజనాలు
25 ఏళ్ల సర్వీస్ లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఈ వీఆర్ఎస్ స్కీం అందుబాటులో ఉంటుంది. వీఆర్ఎస్ స్కీం డిసెంబర్ 1న ప్రారంభమై ఫిబ్రవరి చివరన ముగుస్తుంది. 11,565 మంది అధికారులు, 18,625 ఇతర సిబ్బందికి వీఆర్ఎస్ ఎంచుకునేందుకు అర్హులుగా ఉన్నారు. 2020 జూలై శాలరీ ఆధారంగా వీరికి చెల్లింపులు ఉంటాయి. అర్హత కలిగిన ఉద్యోగుల్లో 30 శాతం మంది ఈ స్కీంకు మొగ్గు చూపినా రూ.1,663 కోట్లు మిగులు ఉంటుంది. వీఆర్ఎస్ ఎంచుకుంటే గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, వైద్యం తదితర ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు, ఈ స్కీం కింద రిటైర్ అయిన వారు పదవీ విరమణ తేదీ నుండి రెండేళ్ల తర్వాత తిరిగి బ్యాంకులో చేరేందుకు లేదా సర్వీసులు అందించేందుకు వెసులుబాటు ఉంది.


Click it and Unblock the Notifications