SAP షాక్: AIతో 10,000 ఉద్యోగాలు గల్లంతు? మీ భవిష్యత్తు ఏంటి?
ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ SAP, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ పెరుగుదల కారణంగా ఇతర టెక్ కంపెనీల బాటలోనే భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులలో సుమారు 10,000 మందిని తొలగించాలని SAP ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ లేఆఫ్స్‌తో, కంపెనీ తన మొత్తం ఉద్యోగులలో 9 శాతం మందిని తగ్గించాలని నిర్ణయించుకుంది.
అయితే, SAP ఒక యూరోపియన్ కంపెనీ కావడంతో, అక్కడి లేబర్ యూనియన్లతో చర్చించిన తర్వాతే తొలగింపుల పూర్తి సంఖ్యపై స్పష్టత వస్తుంది. అందువల్ల, 10,000 మంది తొలగింపు అనేది కచ్చితమైన సంఖ్య కాదు, ఇది మారే అవకాశం ఉంది.
యూరోపియన్ మార్కెట్‌లో చేసే లేఆఫ్స్‌కు మాత్రమే SAP లేబర్ యూనియన్ల అనుమతి తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఉద్యోగాల కోతకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. కాబట్టి, ఆయా దేశాల్లో ఎప్పుడైనా తొలగింపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.

యూరప్‌లోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటైన SAP సీఈఓ, కంపెనీని 'AI-ఫస్ట్ స్ట్రాటజీ' దిశగా మార్చాలని ప్రకటించి కొన్ని కీలక మార్పులు చేశారు. దీని ఫలితంగా, 2026లోనే రెండుసార్లు మేనేజ్‌మెంట్ బోర్డును పునర్‌వ్యవస్థీకరించారు.
ఇంతేకాకుండా, SAPలోని ఆరుగురు బోర్డు సభ్యులలో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో, ఏయే విభాగాల్లో ఖర్చులను, ఉద్యోగులను తగ్గించవచ్చో పరిశీలించాలని కంపెనీ ఉన్నత యాజమాన్యం ఆదేశించింది.
దీంతో పాటు ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా, SAP ప్రొడక్ట్ లీడ్ ముహమ్మద్ ఆలం తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకోకపోవడంతో మార్చిలో కంపెనీని వీడనున్నారు. ఆయన బాధ్యతల్లో చాలా వరకు సీఈఓ క్రిస్టియన్ క్లెయిన్ స్వీకరించారు.
అదేవిధంగా, SAP సేల్స్ విభాగం హెడ్ థామస్ సౌరెసిగ్, అయోనోస్ గ్రూప్ సీఈఓగా వెళ్లేందుకు నిర్ణయించుకోవడంతో గత వారం కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా SAP సంస్థలో సుమారు 1,10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారతదేశంలో కూడా SAPకు భారీ కార్యాలయం, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండటం గమనార్హం. ప్రస్తుతం SAP కేవలం ఏఐ టెక్నాలజీ వల్లే కాకుండా, యాజమాన్య స్థాయిలోనూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది.


Click it and Unblock the Notifications