ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, సురక్షిత పెట్టుబడి వైపు పరుగు: రూ.1300 పెరిగిన బంగారం ధర
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కొనసాగుతుండటమే కాదు, ఉక్రెయిన్ పైన మిలిటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైనట్లు ప్రకటన రావడం, ప్రపంచ మార్కెట్ల పైన, తద్వారా భారత మార్కెట్ పైన తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇరుదేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మరలుతున్నారు. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్భణం కూడా పసిడి పెరుగుదలకు కారణం.

బంగారం ధరల షాక్
బంగారం ధరలు నేడు ప్రారంభ సెషన్‌లోనే భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభ ప్రకటన ఈ భారీ పెరుగుదలకు కారణమైంది. ఉదయం గం.9.45 సమయానికి ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.1309 పెరిగి రూ.51,688 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1299 పెరిగి రూ.51,841 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి నేడు 1950 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 40 డాలర్లు ఎగిసి 1950 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1910 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నటి సెషన్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు పరుగులు పెడుతోంది.

క్రితం సెషన్‌లో ఇలా...
పసిడి ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.61 పెరిగి రూ.50,389 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.75 పెరిగి రూ.50,567 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లోను భారీగానే పెరిగింది. క్రితం సెషన్‌లో 1910 డాలర్లకు పైన ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.225 పెరిగి రూ.64,570 వద్ద ముగిసింది.

వెండి ధరలు అదే దారి
వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. నేడు ఉదయం సెషన్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.1703 పెరిగి రూ.66,288, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1706 పెరిగి రూ.67,095 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 0.500 డాలర్లు ఎగిసి 25 డాలర్లను క్రాస్ చేసింది.


Click it and Unblock the Notifications