Gold Price Today: హమ్మయ్య! బంగారం ఊరట, భారీగా తగ్గిన ధరలు
బంగారం ధరలు శాంతిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు ముందు రూ.48,000 స్థాయిలో ఉన్న పసిడి యుద్ధం నేపథ్యంలో రూ.51,000 క్రాస్ చేశాయి. నేడు(ఫిబ్రవరి 25) ఈ మార్కు కిందకు వచ్చాయి. ప్రారంభ సెషన్‌లో బంగారం ఏకంగా రూ.600 వరకు తగ్గింది. వెండి రూడా రూ.1250 వరకు తగ్గి, రూ.65,000 దిగువకు వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ధరలు క్రమంగా పెరుగుతాయని భావించినప్పటికీ, రష్యా పట్టు సాధించడం మార్కెట్ పైన ప్రభావం చూపింది.

నిన్న భారీగా పెరిగి...
ఉక్రెయిన్ పైన రష్యా దాడి నేపథ్యంలో బంగారం ధరలు క్రితం సెషన్లో భారీగా పెరిగాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభం కాగానే గోల్డ్ ఫ్యూచర్ అంతర్జాతీయ మార్కెట్లో 1850 డాలర్లు, దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లో 50,000 క్రాస్ చేసింది. నిన్న పుతిన్ యుద్ధం ప్రకటన చేసిన తర్వాత ధరలు పరుగులు పెట్టాయి. దీంతో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1926 డాలర్ల వద్ద, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.1151 పెరిగి రూ.51,530 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.52,797ను తాకి, 53,000 దిశగా కనిపించింది. అయితే ఉక్రెయిన్ పైన రష్యా పట్టు, ప్రపంచ దేశాలు కేవలం ప్రకటనలతో చేతులు దులుపుకునే పరిస్థితులు కనిపించడంతో ధరలు కాస్త చల్లబడ్డాయి. క్రితం సెషన్‌లో వెండి ధరలు ఏకంగా రూ.1500 వరకు పెరిగి రూ.66,000 క్రాస్ చేశాయి. కామెక్స్‌లో 25 డాలర్లను సమీపించింది. అయితే నేడు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

నేడు ఇలా తగ్గింది
నేడు ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.578 తగ్గి రూ.50,965 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధరలు కూడా నేడు తగ్గుముఖం పట్టాయి. కామెక్స్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1179 తగ్గి 64,852 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1225 తగ్గి రూ.65,673 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 10.85 డాలర్లు లేదా 0.56 శాతం క్షీణించి 1916 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.87 డాలర్లు తగ్గి 24,400 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ధరలు ఎలా ఉండవచ్చు
సాంకేతికంగా పసిడి ధరలు 1878 స్థాయికి తగ్గవచ్చునని, అయితే యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారుల రిస్క్ ఆందోళన పెరుగుతున్నందున 1908 స్థాయిలో ఈ వారం ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే మన వద్ద రూ.50,000 పైనే ఈ వారం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications