బలహీనపడుతున్న డాలర్, రూపాయి జూమ్: పెరుగుతున్న క్రూడ్ ధరలు
ముంబై: అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి ఈ రోజు (జూలై 21, మంగళవారం) బలపడింది. ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్తుండటం, అంతర్జాతీయ కరెన్సీ బాస్కెట్లో డాలర్ బలహీనపడటం వంటి వివిధ కారణాలతో రూపాయి బలపడుతోంది. ఈ రోజు రూపాయి 17 పైసలు పెరిగి 74.74 వద్ద స్థిరపడింది. డాలర్ మారకంతో 74.79 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైన రూపాయి ఇంట్రాడే గరిష్టస్థాయి 74.73ని, 74.87 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు గత సెషన్ 74.91తో పోలిస్తే 74.74 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.03 శాతం పడిపోయి 95.80 వద్దకు చేరుకుంది.

రూపాయి బలపడటానికి కారణాలు
స్టాక్ మార్కెట్లు రోజు రోజుకు పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ సిక్స్ కరెన్సీ బాస్కెట్లో డాలర్ వ్యాల్యూ తగ్గుముఖం పడుతోంది. ఇటీవల నాలుగు నెలల కనిష్టానికి చేరుకుంది. దేశీయ ఈక్విటీలు సానుకూలతకు తోడు కరోనా వ్యాక్సీన్ ఆశలు, విదేశీ ఫండ్స్ ఇన్‌ఫ్లో వంటివి కూడా రూపాయికి మద్దతు ఇచ్చాయని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ మొదటి దశ మానవ పరీక్షల ఫలితాలపై ఆశావాహక ధోరణి వ్యక్తమవుతోంది. అలాగే ఇండియాలో తొలి వ్యాక్సీన్ కోవాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

ఈక్విటీలు లాభాల్లో.. పెరుగుతున్న చమురు ధరలు
స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 511 పాయింట్లు లాభపడి 37,930 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు లాభపడి 11,162 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి. మరోవైపు చమురు ధరల్లో మంగళవారం స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ నుండి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల అంతర్జాతీయ సమాజం షట్ డౌన్ నుండి బయటపడుతుండటంతో చమురు ధరల్లో పెరుగుదల నమోదవుతోంది.

క్రూడ్ ఫ్యూచర్ ధర
చమురు ధరలు ఈరోజు 1.83 శాతం ఎగిశాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 44 డాలర్లకు చేరుకుంది. క్రూడాయిల్ ఆగస్ట్ డెలివరీ ఇంట్రాడేలో గరిష్టం రూ.3,146కు, కనిష్టం రూ.3,060 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం గం.3.30 సమయానికి క్రూడాయిల్ బ్యారెల్ ధర ఆగస్ట్ డెలివరీ రూ.56 పెరిగి రూ.3,124 సెప్టెంబర్ డెలివరీ రూ.42 పెరిగి రూ.3,137 పలికింది.


Click it and Unblock the Notifications