నిమిషాల్లో రూ.5 లక్షల కోట్లు పోయాయి: భారీ నష్టాల్లో టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. తొలి గంటలోనే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరయింది. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు వణికిపోతున్నాయి సౌదీ అరేబియా రాకపోకలు నిలిపివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లకు భయం రెట్టింపయింది. 2008 తర్వాత మార్కెట్ ఇంతగా నష్టపోవడం ఇదే తొలిసారి.
చైనాలో కంపెనీలు, సంస్థలు మూతబడటంతో ఎగుమతులు తగ్గి ఆ ఫలితం క్రమంగా కనిపిస్తోంది. శుక్రవారం సెన్సెక్స్ 1,150 పాయింట్ల వరకు పడిపోయింది. దీంతో శుక్రవారం తొలి గంటలోనే ఇన్వెస్టర్ల సంపద ఐదు లక్షల రూపాయలు హరించుకుపోయింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 1,550 పాయింట్ల వరకు దిగజారింది. భారీగా పడిపోయిన షేర్లలో...
కరోనా దెబ్బ... భారీ నష్టాల్లో మార్కెట్లు.. లక్షల కోట్లు ఆవిరి

టీసీఎస్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ షేర్లు 2.5 శాతం నుండి 3.5 శాతం మధ్య, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు 4 నుండి 5 శాతం పడిపోయాయి. ఇండియా వీఐఎక్స్ ఇండెక్స్‌లో భారత్ 15 శాతం వృద్ధి శాతం కూడా భయానికి గురి చేసింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళనలు కలిగించింది. ఈ రోజు ప్రభుత్వం వృద్ధి రేటును ప్రకటించనుంది. మార్కెట్లలో ఇది భయాలను కలిగించింది. జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుండి 4.7 శాతం మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
గత త్రైమాసికంతో సమానంగా ఉన్నా లేక పెరిగినా ఊరట కలిగించే అంశం. తగ్గితే మాత్రం మార్కెట్ నష్టాలు మరింతగా కొనసాగవచ్చు. వాల్ స్ట్రీట్ భారీగా పతనం కావడం కూడా ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది. జపాన్ సూచీలు 3.5 శాతం, చైనా మార్కెట్లు 2.5 శాతం నష్టపోయాయి. అమెరికాలో డోజోన్స్ ఒక రోజులో అతిపెద్ద పతనాన్ని చూసింది. దాదాపు 1200 పాయింట్లు కోల్పోయింది. ఫిబ్రవరి 19 తర్వాత ఎస్ అండ్ పీ 500 కూడా 10 శాతం కోల్పోయింది.


Click it and Unblock the Notifications