లక్నో: ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లోని పెర్‌ఫ్యూమ్ కంపెనీపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు నిర్వహిస్తోన్న దాడులు, సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోన్న పియూష్ జైన్ నివాసంపై చోటు చేసుకున్న ఈ దాడుల్లో కళ్లు బైర్లు కమ్మేంతటి స్థాయిలో నగదు మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు విలువ 177.45 కోట్ల రూపాయలు. దీన్ని లెక్క పెట్టడానికే రెండురోజుల సమయం తీసుకుంది. అత్యధిక మొత్తాన్ని సీజ్ చేసిన రెయిడ్‌గా ఇది చరిత్రలో నిలిచిపోయింది.
పియూష్ జైన్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. పియూష్ జైన్ కొద్దిరోజుల కిందటే ఈ పెర్ఫ్యూమ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. తాజాగా ఆయన నివాసంపై జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో కట్టలు కట్టలుగా డబ్బు బయటపడింది. రెండు అల్మరాల్లో నోట్ల గుట్టలు కనిపించాయి. గురువారం సాయంత్రం ఆరంభమైన ఈ దాడులు రెండు రోజుల పాటు కొనసాగాయి.

కాన్పూర్‌తో పాటు కన్నౌజ్‌లో ఏకకాలంలో దాడులు చేపట్టారు అధికారులు. దాడులు మొదలైనప్పుడు లెక్కించడం మొదలుపెడితే అది పూర్తి కావడానికి రెండురోజుల సమయం పట్టింది. మొత్తంగా 177.45 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు జీఎస్టీ డైరెక్టరేట్ జనరల్ అధికారులు తెలిపారు. పియూష్ జైన్‌పై పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి. తరచూ ఆయన జీఎస్టీని ఎగవేస్తూ.. పెద్ద ఎత్తున బ్లాక్ మనీని కూడబెట్టుకున్నారంటూ వార్తలు వచ్చాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏకంగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ అధికారులు రంగంలోకి దిగారు. దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా వందల సంఖ్యలో ఫేక్ ఇన్‌వాయిస్‌లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్‌వాయిస్‌లను సృష్టించి, తద్వారా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారించారు. పియూష్ జైన్ నివాసంలో దొరికిన నగదు మొత్తం ఇలా నకిలీ ఇన్‌వాయిస్, ఈ-వే బిల్లులను జారీ చేయడం వల్ల ఆర్జించినవేనని తేల్చారు.
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 67 సెక్షన్ కింద ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని, దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశామని అధికారులు చెప్పారు. ఎక్కువ మొత్తం 500, 2000 రూపాయల నోట్ల డినామినేషన్‌లో ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ దాడుల ఘటనలో ఇప్పటిదాకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని జీఎస్టీ అధికారులు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications