మరింత పెరగనున్న స్నానపు సబ్బుల ధరలు: ఎందుకంటే..?
ముంబై: స్నానపు సబ్బుల ధరలు మరింత పెరగనున్నాయి. సబ్బుల తయారీలో ఉపయోగించే ముడిసరుకు ధరలు పెరగడంతో దేశీయంగా సబ్బుల ధరలు పెంచే ఆలోచన చేస్తున్నాయి పలు కంపెనీలు. సబ్బులు వంటి తమ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ధరను 5-6 శాతం వరకు పెంచుతున్నట్లు హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ ఇప్పటికే ప్రకటించింది.

సబ్బుల ధరలు పెంపు..
లక్స్, లైఫ్ బాయ్, రెక్సోనా లాంటి తదితర సబ్బులను హిందుస్థాన్ యూనీలీవర్ సంస్థ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సింథాల్ వంటి సౌందర్య సాధానల తయారీదారు గోద్రెజ్ కన్స్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కూడా తమ ఉత్పత్తుల ధరల్లో 5-6శాతం మేర పెంచుతామని వెల్లడించింది. ఇతర సబ్బుల తయారీ కంపెనీలు కూడా ఇదే బాటను అనుసరిస్తున్నాయి.

ముడి సరుకు ధరలు పెరగడంతోనే..
పామాయిల్ నుంచి లభించే పామ్ ఫ్యాటీ యాసిడ్ డిస్టిలేట్ అనే పదార్థం సబ్బుల తయారీలో అతి ముఖ్యమైనదిగా ఉన్నది. దీని ధర 2019 నవంబర్‌లో 47శాతం పెరిగింది. ఈ కారణంగా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వ్యయం పెరిగింది. ఇక ఆర్థిక మాంద్యం వల్ల భారతీయుల వినిమయ వ్యవయం కూడా తగ్గుముఖం పట్టింది. నీల్సన్ డేటా నివేదిక ప్రకారం ఎఫ్ఎంసీజీ కేటగిరీలో పెరుగుదల 2018లో 11.1శాతం ఉండగా, 2019లో అది 1.9శాతానికి పడిపోయింది.

ధరలు పెంచకతప్పని పరిస్థితి
ఈ క్రమంలోనే తమ ఉత్పత్తులపై ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇక, తయారీ కంపెనీల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే సబ్బుల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మరింత పెంచితే మధ్యతరగతి, పేద ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications