Strait of hormuz: సోమవారం హర్మూజ్ జలసంధిని దాటిన 36 నౌకలు.. అందులో 11 నౌకలు భారత్‌కే..
కొద్ది సంవత్సరాల క్రితం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ప్రపంచ దేశాలు కాస్త ఇబ్బంది పడ్డాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. యుద్ధం ఇప్పటికీ కొనసాగుతున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. కానీ కొద్ది నెలల క్రితం ప్రారంభం అయిన అమెరికా, ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రపంచంలోని మెజారిటీ చమురు రవాణా ఈ జల సంధి గుండా కొనసాగేది. ఇరాన్ దీన్ని మూసివేయడం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడింది. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. భారత్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధాన్ని త్వరగా ముగించాలని.. లేకుంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. ఎట్టకేలకు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. జూన్ 17న అమెరికా, ఇరాన్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ శాంతి ఒప్పందంతో హర్మూజ్ జల సంధి వద్ద రవాణా పరిస్థితులు మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు చెందిన 11 నౌకలు హర్మూజ్ జల సంధిని దాటి భారత్ వైపు వస్తున్నట్లు ప్రకటించారు.

ఒక్కోదాంట్లో 2.85లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉన్న మూడు భారత జెండాలున్న నౌకలు, విదేశీ జెండా ఉన్న ఓ ఎల్‌పీజీ నౌక, విదేశీ జెండా ఉన్న మరో ముడి చమురు ట్యాంకర్, ఆరు విదేశీ జెండాలున్న ఎరువులు సరఫరా చేస్తున్న భారీ నౌకలు ఉన్నట్లు వెల్లడించారు. భారత జెండా కలిగిన 10 షిప్పులు కూడా ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే ఉన్నాయని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఇండియాకు రావాల్సిన 11 నౌకలు హర్మూజ్ జలసంధిని క్రాస్ చేశాయని ఆయన ప్రకటించారు.
పశ్చిమ ఆసియా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని.. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా చమురు దిగుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ హైడ్రోకార్బన్, ద్రవీకృత గ్యాస్ రవాణాకు ప్రధాన మార్గంగా పనిచేసే ఈ అత్యంత కీలకమైన సముద్ర మార్గం త్వరలో పూర్తిగా తెరుచుకునే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం జారినప్పటికీ లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడులు జరపడంతో గత శనివారం హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో స్విట్జర్లాండ్ లో ఇరు దేశాల మధ్య సానుకూలంగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో జల సంధిని తిరిగి ఓపెన్ చేశారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి జరిగినప్పటి నుంచి హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఏర్పడిన తీవ్రమైన అడ్డంకుల తర్వాత, గత కొన్ని రోజులుగా వాణిజ్య నౌకా రవాణా పెరిగినట్లు స్వతంత్ర సముద్రయాన పర్యవేక్షణ సంస్థలు పేర్కొన్నాయి. సోమవారం నాడు ఏకంగా 36 రవాణా నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించాయని సమాచారం. కాగా అమెరికా ఇరాన్ చమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేశాయి.


Click it and Unblock the Notifications