కస్టమర్లకు జియో భారీ షాక్: కాల్స్, డేటా ఛార్జీలు ఏకంగా 40 శాతం పెంపు, సరికొత్త AIO ప్లాన్
ఢిల్లీ: మూడేళ్ల క్రితం రిలయన్స్ జియో కారణంగా వాయిస్ కాల్స్, డేటా ఛార్జీ వినియోగదారులకు చౌకగా మారాయి. చౌక ధరలతో టెలికం కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. రిలయన్స్ జియో కూడా డిసెంబర్ 6వ తేదీ నుంచి ధరలు పెంచుతోంది. కాల్స్, డేటా ఛార్జీలు వరుసగా 40 శాతం వరకు పెరగనున్నాయి. కొత్త పథకాల కింద కస్టమర్లకు 300 శాతం అదనపు ప్రయోజనం కల్పిస్తామని తెలిపింది. అలాగే, ఇతర నెట్ వర్క్స్‌కు కాల్ పరిమితి ఉంటుంది.
వినియోగదారులకు టెలికం కంపెనీల షాక్: పెంచిన ఛార్జీలు ఇలా...

డిసెంబర్ 6 నుంచి కొత్త ప్లాన్స్
వాయిస్ కాల్స్, డేటా ఛార్జీలపై 40 శాతం వరకు పెంచుతున్నట్లు రిలయన్స్ జియో ఆదివారం ప్రకటించింది. ఇందులో భాగంగా 6వ తేదీ నుంచి కొత్త అన్ లిమిటెడ్ ప్లాన్స్ తీసుకు వస్తామని పేర్కొంది. ఈ ప్లాన్స్‌లో నాన్ జియో నెంబర్లకు చేసే కాల్స్‌పై FUP పరిమితి విధిస్తామని చెప్పింది. నూతన ప్లాన్ కింద జియోకు వచ్చే వారికి 300 శాతం అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కొంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి కొత్త ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. టెలికం పరిశ్రమ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పెంపు తప్పడం లేదని పేర్కొంది.

ఆల్ ఇన్ వన్ ప్లాన్
అన్ లిమిటెడ్ వాయిస్, డేటాతో కొత్త all in one (AIO) ప్లాన్‌ను జియో ప్రవేశపెడుతోందని, ఇతర నెట్ వర్క్స్‌కు చేసే కాల్స్‌పై ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)ని కలిగి ఉంటాయని పేర్కొంది. అలాగే, సవరించిన టెలికం ఛార్జీల (AGR) విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది.

అందుకే పెంపు
కాగా, AGRకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌పై భారీగా భారం పడింది. వొడాఫోన్ ఐడియా రూ.44,150 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఎయిర్‌టెల్ చెల్లించాల్సిన మొత్తం రూ.35,586 కోట్లు. ఈ కంపెనీ కూడా సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.23,045 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. జియో కూడా ఈ కంపెనీలతో పోలిస్తే తక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంది. ఈ నష్టాల్ని పూడ్చుకోవడానికి ఇప్పుడు చార్జీలను పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి.


Click it and Unblock the Notifications