కరోనాపై పోరుకు తెలంగాణకు ముఖేష్ అంబానీ రూ.5 కోట్ల విరాళం
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ వైరస్‌పై పోరుకు రిలయన్స్, టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తున్నాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వందల కోట్ల విరాళాలు ఇవ్వడంతో పాటు ముంబైలో కరోనా ఆసుపత్రిని వేగంగా నిర్మించింది. మాస్కులు, శానిటైజర్లు అందిస్తోంది. ఎమర్జెన్సీ వెహికిల్స్‌కు ఉచిత ఇంధనం ఇస్తోంది.
పీఎం కేర్స్ ఫండ్స్‌కు పెద్ద మొత్తంలో విరాళమిచ్చిన రిలయన్స్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి రూ.5 కోట్లను సీఎం సహాయనిధికి అందించింది. జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి ఆర్ఐఎల్ కార్పోరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసి అందించారు. కరోనాపై పోరుకు దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు రిలయన్స్ రూ.530 కోట్లు అందించింది. మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు కూడా విరాళాలు అందించింది.

కరోనా వల్ల వీధినపడిన వేలాది కుటుంబాలకు ఆహార సరఫరా చేసేందుకు రిలయన్స్ సిబ్బంది పాటుపడుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్‌లు కరోనాపై పోరుకు ప్రభుత్వాలకు సహకరిస్తూ, అవసరమైన మేరకు పేదలకు సహాయం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉచిత భోజనం అందిస్తోంది.
హెల్త్ వర్కర్స్, సంరక్షకుల కోసం రిలయన్స్ రోజుకు లక్ష మాస్కులు, పీపీఈల ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ వాహనాలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్ అందిస్తోంది రిలయన్స్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లక్షలాదిమంది భారతీయులకు రిలయన్స్ రిటైల్ దుకాణాలను అందుబాటులో ఉంచడంతో పాటు డెలివరీ అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్లు అందించిన రిలయన్స్‌ను కేటీఆర్ ప్రశంసించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications