Reliance Housing Finance: స్టాక్ మార్కెట్లు గడచిన రెండు రోజులుగా సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకుని ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపుతున్నాయి. ఈ కోలాహలంలో అనిల్ అంబానీ కంపెనీలు సైతం పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అంబానీకి చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా లాభాలను చూస్తున్నాయి. ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకు ఉత్సాహం చూపటంతో వరుసగా అప్పర్ సర్క్యూట్ తాకుతూ పోతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ల గురించే. కొన్ని వారాల కిందట ఈ కంపెనీ వ్యవహారంలో సెబీ సంచలన నిజాలను బయటపెట్టింది. దర్యాప్తులో భాగంగా కంపెనీ మాజీ అధికారులు, అనిల్ అంబానీతో పాటు ఇటీవల అతని తనయుడు అన్మోల్ అంబానీపై కూడా చర్యలు చేపట్టింది. ఈ షాక్ కారణంగా కంపెనీ షేర్లలో కొంత అమ్మకాలు నమోదైనప్పటికీ మళ్లీ కొనుగోళ్లు తిరిగి పుంజుకున్నాయి. గడచిన వారం రోజులుగా రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు నిరంతరం అప్పర్ సర్క్యూట్ తాకుతున్నాయి.

నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకిన తర్వాత రూ.5.27 ధరకు చేరుకున్నాయి. ఐదు రోజుల ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు ఏకంగా 22 శాతం పెరుగుదలను చూశాయి. రెండు రోజుల కిందట అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ పై సెబీ రూ.కోటి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఆగస్టులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో రుణాల పేరుతో జరిగిన నిధుల దుర్వినియోగం వ్యవహారంలో అనిల్ అంబానీపై రూ.25 కోట్లు జరిమానాను మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ విధించింది.
అనిల్ అంబానీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ దివాలా తీసిన సమయంలో రియన్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు కుప్పకూలాయి. కంపెనీ షేర్ ధర ఏకంగా 95 శాతం పడిపోయింది. సెప్టెంబర్ 22, 2017న షేర్ ధర రూ.107 వద్ద ఉండగా.. ప్రస్తుతం అది తిరిగి పుంజుకుంటోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్‌ఐసికి 1.54% వాటాలు కూడా ఉన్నాయి. అనిల్ అంబానీ చాలా కాలం తర్వాత తిరిగి వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నంలో భాగంగా రుణాలను చెల్లిస్తూ అప్పుల ఊబిలో ఉన్న కంపెనీలను రివైవ్ చేస్తోంది. ఇది ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపటంతో పాటు కంపెనీల భవిష్యత్ కార్యాచరణపై సానుకూల ధృక్పదాన్ని కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications