Reliance Capital: దేశంలో కుబేరుల జాబితాలో అంబానీల కుటుంబం హవా ఒకప్పుడు కొనసాగింది. అయితే తమ్ముడు అనిల్ అంబానీ కుదేలు వ్యాపార ప్రపంచంలో ఎవ్వరూ ఊహించనిది. అయితే ఇదే సమయంలో అన్న ముఖేష్ అంబానీ మాత్రం కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టి వేగంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో అప్పులు కట్టేందుకు అనిల్ తన కంపెనీలను ఒకటి తర్వాత మరొకదాన్ని విక్రయిస్తున్నారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుదారు హిందూజా గ్రూప్ కంపెనీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి మరింత సమయం పడుతోంది. వాస్తవానికి దీనిపై రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించారు. హిందూజా గ్రూప్ కంపెనీకి ఆస్తులను బదిలీ చేయడానికి 10 రోజుల సమయం కోరారు.

వాస్తవానికి రిలయన్స్ క్యాపిటల్ ఆస్తులను హిందూజా గ్రూప్ కంపెనీ ఏషియా ఎంటర్‌ప్రైజెస్‌కు బదిలీ చేసేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఆర్‌బీఐ నవంబర్ 17, 2023న దీనికి ఆమోదం తెలపగా ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువు ఆరు నెలల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే అనుకున్న దాని కంటే ప్రక్రియ ఆలస్యం అవటంతో ప్రస్తుతం రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ మే 27 వరకు ఆర్బీఐ నుంచి గడువు పొడిగింపును కోరింది.
NCLT ఆర్డర్ ప్రకారం హిందూజా గ్రూప్ కంపెనీ కోసం రిజల్యూషన్ ప్లాన్‌ను అమలు చేయడానికి గడువు మే 27గా ఉంది. ముంబై బెంచ్ ఫిబ్రవరి 27న రిజల్యూషన్ ప్లాన్‌ను ఆమోదిస్తూ.. మే 27లోగా రిజల్యూషన్ ప్లాన్‌ను అమలు చేయాలని ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ని ఆదేశించింది. ఈ డీల్ కింద రూ.9,650 కోట్ల పరిష్కార ప్రణాళికను ట్రిబ్యునల్ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI షరతులతో కూడిన ఆమోదాన్ని తెలిపిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఇండస్‌ఇండ్ ప్రతినిధి మాట్లాడుతూ కొనుగోలును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామనన్నారు. మే 27, 2024 నాటికి NCLT గడువులోగా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. IRDAI ఆమోదం పొందిన 48 గంటల్లో బిడ్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా డీల్‌ను పూర్తి చేస్తామని ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ చైర్మన్ అశోక్ హిందూజా గతంలో చెప్పారు.


Click it and Unblock the Notifications