ద్రవ్యోల్భణం, వడ్డీ రేటు: ఆర్బీఐ శక్తికాంత దాస్ ఏం చెబుతారు?
కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ(MPC) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ఆగస్ట్ 4వ తేదీన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఎంపీసీ సమావేశం నేడు (శుక్రవారం, ఆగస్ట్ 6) ముగుస్తుంది. MPC వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు మీడియాకు వివరిస్తారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సమావేశం జరిగింది. ఈ రోజు కమిటీ కీలక నిర్ణయాలు వెలువడుతాయి. ఆర్బీఐ MPC సమావేశం నిర్ణయాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు.

రెపో రేటు 7వసారి
కరోనా థర్డ్ వేవ్ భయాలు, వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత రెండు నెలలుగా ఆర్బీఐ నిర్దేశించుకున్న 2 నుండి 6 శ్రేణికి మించి నమెదవడం వంటి అంశాల నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు, రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది నాలుగు శాతంగా ఉంది. ఆర్బీఐ వరుసగా ఆరుసార్లు వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించింది. ఇప్పుడు అదే జరిగితే ఏడోసారి అవుతుంది.

సరళతర విధానాలు అవలంభించాలి
కరోనా నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలు అవలంభించాల్సిన అవసరం ఉండటం, ద్రవ్యోల్భణం కట్టడి అవుతోందనే అంచనాల నేపథ్యంలో కీలకమైన రెపో రేటును అలాగే కొనసాగించవచ్చునని చెబుతున్నారు. మార్చి 2020 తర్వాత కరోనా కారణంగా ఆర్బీఐ 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం కాగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉంది. ఇక, FY22లో ద్రవ్యోల్భణం ఔట్‌లుక్ గతంలో 5.1 శాతం అంచనా వేయగా, దీనిని సవరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వ్యవస్థలోకి సౌకర్యవంతమైన లిక్విడిటీ వైపు మొగ్గు చూపనుంది.

జీడీపీ వృద్ధి రేటు అంచనాలు
ప్రస్తుత ద్రవ్యోల్భణ రేట్లు 5.1 శాతం ఉండగా FY22 సంవత్సరానికి గాను 5 శాతం నుండి 5.22 శాతానికి సవరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో వేగంగా పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనాకు రావొచ్చునని చెబుతున్నారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను సవరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఎక్కువ మంది నిపుణులు చెబుతున్నారు. కొంతమంది నిపుణులు మాత్రం సవరించే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.

వెయిట్ అండ్ వాచ్
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు ఉదయం గం.10 సమయానికి మీడియా ముందుకు వస్తారు. మానిటరీ పాలసీ నిర్ణయాలను వివరిస్తారు. వడ్డీ రేటు, ద్రవ్యోల్భణం వంటి అంశాలపై వెయిట్ అండ్ వాచ్‌గా ఆర్బీఐ ఉండవచ్చునని అంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసినప్పటికీ, థర్డ్ వేవ్ అంశం ఆందోళన కలిగిస్తోంది. దీనిని పరిగణలోకి తీసుకొని పలు అంశాలపై వెయిట్ అండ్ వాచ్‌గా ఉండవచ్చునని అంటున్నారు. ఆర్బీఐ ఎంపీసీ సమావేశానికి సంబంధించి రూటర్స్ పోల్ నిర్వహించగా, 61 మంది పాల్గొన్నారు. గత ఏడాది మే నెల నుండి నాలుగు శాతంగా ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెంచే అవకాశముందని చెబుతున్నారు. అంటే 2023 మార్చి చివరి నాటికి వడ్డీ రేటు 4.5 శాతానికి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications