ముంబై: దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణంలో పైపైకి దూసుకెళ్తూనే ఉంది. మార్చిలో నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణంతో పోల్చుకుని చూస్తే.. ఏప్రిల్‌లో ఇది మరింత పైకి ఎగబాకింది. దీనికి సంబంధించిన లెక్కలు ఇటీవలే వెలువడ్డాయి. వ్యవసాయం, కార్మిక రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రిటైల్ సెగ్మెంట్.. ఇలా కీలక రంగాల్లో ఈ పెరుగుదల కనిపించింది.

రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్..
ఏప్రిల్‌లో వ్యవసాయం, గ్రామీణ కార్మిక రంగాల్లో ద్రవ్యోల్బణం 6.44, 6.67 శాతం మేర పెరిగింది. ఇదివరకు వ్యవసాయంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09, గ్రామీణ కార్మిక రంగంలో 6.33 ఉండేది. ఈ పెరుగుదల ఫలితంగా- కన్జ్యూమర్ ఇండెక్స్ నంబర్‌ను కూడా సవరించాల్సి వచ్చింది. 10 పాయింట్ల మేర పెంచింది కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ. దీనితో వ్యవసాయానికి సంబంధించిన ఇండెక్స్ నంబర్ 1108, గ్రామీణ కార్మిక రంగం-1119 పాయింట్లకు పెరిగింది.

40 బేసిస్ పాయింట్స్..
దీన్ని నివారించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్.. ఇదివరకే కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. కిందటి నెల 4వ తేదీన వడ్డీ రేట్లను పెంచింది. 40 బేసిస్ పాయింట్ల మేర సవరించింది. దీని ఫలితంగా అన్ని రకాల ఈఎంఐలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ రిజర్వుబ్యాంక్ మరోసారి బేసిస్ పాయింట్లను సవరించడానికి సమాయాత్తమౌతున్నట్లు తెలుస్తోంది. వచ్చేవారం మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లను మరో 40 బేసిస్ పాయింట్లు పెంచుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా..
ఈ మేరకు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఓ నివేదికను రూపొందించింది. ఈ నెలలో రేట్లు పెంచుతామంటూ ఇదివరకే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలు సైతం ఇచ్చారు. దీనితో పాటు ఆగస్టులో కూడా ఈ పెంపుదల ఉంటుందని తెలిపింది. ఇంకో 0.35 శాతం మేర సవరించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. జూన్-ఆగస్టుల్లో 0.75 శాతం మేర పెరుగుదల చోటు చేసుకోవచ్చని అభిప్రాయపడింది.

ఈఎంఐలు భారం..
అదే జరిగితే- ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌ను కట్టడం అంత ఈజీ కాబోదు. రిజర్వ్ బ్యాంక్ పెంచిన 40 బేసిస్ పాయింట్ల ప్రభావం ఇప్పటికే ఈఎంఐలపై బాగా పడింది. అన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులన్నీ తమ ఈఎంఐల మొత్తాన్ని సవరించాయి. ఎల్‌ఐసీ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు కూడా బేసిస్ పాయింట్లకు అనుగుణంగా రుణ గ్రహీతలపై భారాన్ని మోపాయి. ఇప్పుడు ఆర్బీఐ మళ్లీ బేసిస్ పాయింట్లను పెంచితే- గృహ నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం తీసుకున్న రుణాలపై ఈఎంఐలు భారమౌతాయి.


Click it and Unblock the Notifications