ముంబై: టన్నుల కొద్దీ కొత్త కరెన్సీ నోట్లను ముంద్రించే భారతీయ రిజర్వుబ్యాంక్‌లో ఇప్పుడు వేతనాల సమస్య మొదలైంది. జీతాల సెటిల్‌మెంట్ల కోసం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన ఉద్యోగులందరూ సామూహిక క్యాజువల్ సెలవులను పెట్టనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు మినహాయించి.. శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తోన్న ఉద్యోగులందరూ ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనబోతోన్నారు.
వేతనాల సెటిల్‌మెంట్ పట్ల గవర్నర్ శక్తికాంత దాస్ గానీ, ఉన్నత అధికారులు గానీ కనీసం దృష్టి సారించట్లేదంటూ రిజర్వుబ్యాంక్ ఉద్యోగులు ఆరోపిస్తోన్నారు. అందుకే తమ నిరసనను తెలియజేయడానికి సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ రిజర్వుబ్యాంక్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయిస్.. గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఓ లేఖ రాసింది. రిజర్వుబ్యాంక్‌లో వేతన సవరణ కిందికి వచ్చే ఉద్యోగుల సంఖ్య సుమారు 12,500 నుంచి 13,000 వరకు ఉంటుంది.
వేతనాల సెటిల్‌మెంట్‌లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోన్నప్పటికీ.. తాము ఇంకా సహనంతో ఉన్నామని యునైటెడ్ ఫోరం ప్రతినిధులు స్పష్టం చేశారు. సహనం ఇంకా కోల్పోనందుకు తమను మెచ్చుకోవాలని వారు చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పరిస్థితి ఉండట్లేదని, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటోందని వివరించారు. నిరసనను తెలియజేయడానికి సామూహిక సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకున్నామని అన్నారు.

రిజర్వుబ్యాంకు ఉద్యోగులకు ప్రతి అయిదేళ్లకు ఒకసారి వేతనాన్ని సవరిస్తారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అధికారులు సమగ్రంగా చర్చించిన తరువాత ఎంత మేర వేతనాన్ని సవరించాలనే విషయం ఖరారు అవుతుంటుంది. 2017లో చివరిసారిగా ఆర్బీఐ ఉద్యోగుల వేతనాలను సవరించారు. ఇప్పుడు మళ్లీ దాన్ని సవరించాలనేది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. సెప్టెంబర్ 22వ తేదీన చివరిసారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారుల మధ్య ఈ వేతన సవరణపై చివరిసారిగా సమవేశం ఏర్పాటైంది.
ఆ సమావేశంలో ఎలాంటి సానుకూల నిర్ణయాలు వెలువడలేదు. వేతనాల పెంపు పట్ల ప్రతిష్ఠంభన నెలకొంది. అఖిల భారత రిజర్వుబ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధ్య ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ చర్చలు ఫలించలేదు. ఆ తరువాత మళ్లీ ఈ భేటీ అనేది ఏర్పాటు కాలేదు. దీనితో ఉద్యోగుల్లో అసహనం వ్యక్తమౌతోంది. దీన్ని తెలియజేస్తూ వారు గవర్నర్ శక్తికాంత దాస్‌కు లేఖ రాశారు. సామూహిక సెలవులపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications