న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లల్లో మార్పులు చేర్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాయాత్తమైందంటూ వెల్లువెత్తిన వార్తలపై భారతీయ రిజర్వుబ్యాంక్ స్పందించింది. దీనిపై పెదవి విప్పింది. కరెన్సీ నోట్ల విషయంలో మూడో సంస్కరణ కింద పలు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలొచ్చాయి. జాతిపిత మహాత్మాగాంధీతో పాటు నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గేయ రచయిత రబీంద్రనాథ్ ఠాగూర్, దేశ అంతరిక్ష పరిశోధనల పితామహుడు, మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మలను ముద్రించే ప్రతిపాదనలను ఆర్బీఐ పరిశీలిస్తోందనే ప్రచారం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది.
ఈ ఇద్దరి బొమ్మలను కూడా కరెన్సీ నోట్ల మీద ముద్రించే యోచనలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉందనేది దాని సారాంశం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే దీనిపై తుదినిర్ణయాన్ని తీసుకోవచ్చనే ప్రచారం చెలరేగింది. ప్రత్యేకించి- 2,000 రూపాయల నోటుపై మహాత్మగాంధీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వాటర్ మార్కులను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఇంటర్నల్ కమిటీ ప్రతిపాదించిందని, దీన్ని గవర్నర్ శక్తికాంత దాస్ తుది ఆమోదం తెలపాల్సి ఉందంటూ ప్రచారం జరిగింది.

ఈ వార్తలపై రిజర్వుబ్యాంక్ స్పందించింది. మౌనం వీడింది. అలాంటి ప్రతిపాదనలేవీ తమ పరిశీలనలో లేవని తేల్చి చెప్పింది. రూపాయి నోట్లల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయట్లేదని స్పష్టం చేసింది. రబీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం లేదా మరే ఇతర జాతీయ నాయకుల బొమ్మలు గానీ, వాటర్ మార్కులను గానీ కరెన్సీ నోట్లపై ముంద్రించే ఆలోచన ఏదీ లేదని తెలిపింది. అలాంటి ప్రకటన కూడా తాము చేయలేదని రిజర్వు బ్యాంక్ అధికారులు అన్నారు. తమ వివరణ తీసుకోకుండానే మీడియాలో ఈ కథనాలు వచ్చినట్లు వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications