రైల్ టెల్ పబ్లిక్ ఇష్యూకు రెడీయా: ఓపెన్ ఎప్పుడంటే?: ప్రైస్ బ్యాండ్ ఎంతో తెలుసా?
ముంబై: రైల్ టెల్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ త్వరలో రాబోతోంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను జారీ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా వందల కోట్ల రూపాయలను సేకరించాలని రైల్ టెల్ కార్పొరేషన్ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నిజానికి- ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మినీ రత్న హోదా ఉంది దీనికి. ఇందులో నుంచి 27 శాతం మేర పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
2018లో కేంద్ర కేబినెట్ పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. ఫలితంగా- పబ్లిక్ ఇష్యూకు వచ్చిందీ కార్పొరేషన్. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడ ద్వారా 819 కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఈ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ చావ్లా వెల్లడించారు. రైల్ టెల్ ఐపీఓ.. ఈ నెల 16వ తేదీన ప్రారంభమౌతుంది. 18న ముగుస్తుంది. ఈ మూడు రోజుల వ్యవధిలో అనుకున్న మేర నిధులను సేకరించాలని భావిస్తోంది.

ఒక్కో ఐపీఓ ప్రైస్ బ్యాండ్ విలువ 93 నుంచి 94 రూపాయల వరకు నిర్ధారించింది. ఈ ఐపీఓ లాట్ సైజు 155. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఇనిషిపయల్ పబ్లిక్ ఆఫర్‌ను కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠంగా 13 లాట్లను కొనుగోలు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లకు అవకాశాన్ని కల్పించారు. కనీస మొత్తంగా14,570 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పబ్లిక్ ఇష్యూల్లో సగం వాటాను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల కోసం కేటాయించారు. మిగిలిన సగం వాటాలో 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లు, 15 శాతం వాటాను నాన్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్లకు దక్కుతుంది.

దేశవ్యాప్తంగా రైల్వే పట్టాల వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుళ్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేది ఈ సంస్థే కావడం, మినీ రత్న హోదా ఉండటం వల్ల బయ్యర్లు రైల్ టెల్ పబ్లిక్ ఇష్యూపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఇప్పటిదాకా 55 వేల కిలోమీటర్లకు పైగా ఆప్టిక్ ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేసింది. 5677 రైల్వే స్టేషన్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీబీఐ కేపిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కేపిటల్ మార్కెట్స్, ఇతర మర్చంట్ బ్యాంకులు ఇష్యూను ఆఫర్ చేస్తాయి.


Click it and Unblock the Notifications