కరోనా మహమ్మారి అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. చాలామంది రుణాలు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో బ్యాంకుల ఎన్పీఏలు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ ఎస్బీఐ, ఐడీబీఐ, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా వివిధ బ్యాంకులు ఎన్పీఏల భయంతో నిధులు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆయా రంగాలను ఆదుకోవడానికి, ప్రజలకు క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉండేందుకు లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు మరింతగా సహకరించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో మూలధనాన్ని పెంచాలని భావిస్తున్నాయి. తమ వద్ద అవసరమైన నిధులు ఉన్నాయని, మూలధనం సేకరించే ఆలోచన లేదని ఇదివరకు చెప్పిన ఎస్బీఐ, ఇప్పుడు రూ.25వేల కోట్ల మూలధనం సేకరించే ఆలోచనలో ఉంది. ఐడీబీఐ బ్యాంకు రూ.11,000 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. గత 5 ఏళ్ల కాలంలోనే కేంద్రం రూ.3.08 లక్షల కోట్ల మూలధనాన్ని పీఎస్‌బీలలో ఇన్‌ఫ్యూజ్ చేసింది.

నిధుల సమీకరణ..
ఇప్పటికే ప్రయివేటు రంగ బ్యాంకులు ఫండ్ రైజింగ్‌కు తెరలేపాయి. హెచ్‌డీఎఫ్‌సీ రూ.14,000 కోట్ల నిధుల సమీకరణ కోసం 19 మర్చంట్ బ్యాంక్స్‌ను ఫైనలైజ్ చేసింది. అలాగే, వ్యాపారవృద్ధి కోసం బాండ్స్ జారీ ద్వారా రూ.50,000 కోట్లు సమీకరించాలనే ప్రతిపాదనను వార్షిక సాధారణ సమావేశంలో షేర్ హోల్డర్స్ అంగీకరించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. ప్రయివేటు బ్యాంకులు నిధుల సమీకరణకు సిద్ధమైనట్లే, ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా కసరత్తు చేస్తున్నాయి. ఆరు నెలల మారటోరియానికి తోడు, ఎన్పీఏలు పెరిగే అవకాశముంది. కరోనా ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్ బఫర్‌ను రూపొందించుకోవాలని ఆర్బీఐ సూచించింది.

ఆ ధర వద్ద నిధులు సమీకరించలేవు
ఎస్బీఐ రూ.25,000 కోట్లు, ఐడీబీఐ రూ.11,000 కోట్లు, బెంగళూరు ప్రధాన కార్యాలయం కలిగిన కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5,000 కోట్ల చొప్పున సమీకరించాలని నిర్ణయించాయి. ఈ ఏడాది చివరి నాటికి మూలధనాన్ని సమీకరించాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా నిర్ణయించింది. అయితే ప్రయివేటు బ్యాంకుల మాదిరిగా ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ నుండి మంచి ధర వద్ద నిధులు సమీకరించలేవు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పీఎస్‌బీ వ్యాల్యూయేషన్ ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకుల మధ్య భారీ అంతరం ఉంటుందని చెబుతున్నారు.

ప్రభుత్వంపై ఆధారం.. రీ-క్యాప్ బాండ్
సాధారణంగా దాదాపు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా క్యాపిటల్ కోసం ప్రభుత్వంపై ఆధారపడుతాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం మూలధనాన్ని ఇన్‌ఫ్యూజ్ చేసేందుకు రీ-క్యాపిటలైజేషన్ బాండ్ మార్గాన్ని ఉపయోగిస్తోంది. రీ-క్యాప్ బాండ్స్ కింద ప్రభుత్వం బాండ్స్‌ను జారీ చేస్తుంది. అలా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ మూలధనంగా ఇన్‌ఫ్యూజ్ చేస్తుంది. గత అయిదేళ్లలో ప్రభుత్వం పీఎస్‌బీలలో రూ.3.08 లక్షల కోట్లను ఇన్‌ఫ్యూజ్ చేసింది. రూ.2.11 లక్షల కోట్లను ఇన్‌ఫ్యూజ్ చేసేందుకు ప్రభుత్వం 2017లో రీక్యాప్ బాండ్ మార్గాన్ని ఎంచుకుంది.

13 శాతంగా సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ..
కరోనా నేపథ్యంలో ఎన్పీఏలు పెరిగే అవకాశముందని, వివిధ కారణాల వల్ల పీఎస్‌బీలు, ప్రభుత్వరంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ ప్లాన్ అవసరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. పీఎస్‌బీల ప్రస్తుత మూలధన సమృద్ధి 13 శాతంగా సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎన్పీఏలు పెరగడం, ఆరు నెలల పాటు మారటోరియం వంటి కారణాలతో తగ్గుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకులు ఎన్పీఏలు 8.3 శాతానికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications