పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)కు రెండు బిలియన్ డాలర్లకు పైగా రుణాలు ఎగ్గొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్న డైమండ్ వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు సంబంధించిన 2,300 కిలోల సానబెట్టిన వజ్రాలు, ముత్యాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు హాంగ్‌కాంగ్ నుండి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.1,350 కోట్ల వరకు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు.
నీరవ్ మోడీ కేసుకు సంబంధించిన వార్తలు.. చూడండి

నీరవ్‌వి 32, చోక్సీవి 76
PNBని మోసగించిన కేసులో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈడీ ఈ కేసును దర్యాఫ్తు చేస్తోంది. ఇందులో భాగంగా హాంగ్‌కాంగ్ నుండి 2,340 కిలోల పాలిష్డ్ వజ్రాలు, ముత్యాలను బుధవారం ఇండియాకు తీసుకు వచ్చారు. మొత్తం 108 బ్యాగేజీలలో వీటిని తీసుకు వచ్చారు. ఇందులో నీరవ్ మోడీకి చెందినవి 32, చోక్సీకి చెందినవి 76 ఉన్నాయి.

న్యాయప్రక్రియ తర్వాత వెనక్కి
ఈ ఖరీదైన వజ్రాలను, ముత్యాలను, నగలను 2018లో వీరు దుబాయ్ నుండి హాంగ్‌కాంగ్ తరలించారు. 2018 జూలైలో ఈ విషయం తెలిసిన అధికారులు నాటి నుండి హాంగ్‌కాంగ్‌తో చర్చలు జరుపుతున్నారు. వీటికి సంబంధించి హాంగ్‌కాంగ్‌లో న్యాయపరమైన లాంఛనాలు పూర్తి చేసి నిన్న భారత్ తీసుకు వచ్చారు. మనీలాండరింగ్ చట్టం కింద వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. వీటిని ఇప్పటి వరకు వీటిని హాంగ్‌కాంగ్‌లోని లాజిస్టిక్స్ కంపెనీ గోడౌన్‌లో ఉంచారు. ఇప్పుడు ముంబైకి తీసుకు వచ్చారు.

ఇంతకుముందు రూ.137 కోట్ల వస్తువులు
ఇంతకుముందు కూడా ఈడీ.. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు సంబంధించిన 33 విలువైన వస్తువులను దుబాయ్, హాంగ్‌కాంగ్ నుంచి తీసుకు వచ్చింది. ఇంతకుముందు సీజ్ చేసిన వాటి విలువ రూ.137 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

అప్పగింతకు భారత్ ప్రయత్నాలు
నీరవ్ మోడీ, అంకుల్ మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి 2 బిలియన్ డాలర్ల రుణం తీసుకున్నారు. దీనిని తిరిగి చెల్లించలేదు. వారు చేతులెత్తేయడంతో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాఫ్తు చేస్తోంది. వీరు 2018లో విదేశాలకు పారిపోయారు. గత ఏడాది అరెస్టైన నీరవ్ మోడీ లండన్ జైలులో ఉన్నాడు. మెహుల్ చోక్సీ ఆంటిగ్వాలో ఉన్నాడు. వీరి అప్పగింతపై భారత్ చర్యలు తీసుకుంటోంది.


Click it and Unblock the Notifications