మందగమనం వదిలేసి, ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి: మోడీ, భేటీలో అదానీ, అంబానీ, మహీంద్రా, రతన్ టాటా
మందగమనంలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన భేటీలో ముఖేష్ అంబానీ, రతన్ టాటా, అదానీ, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్ తదితరులు భేటీ అయ్యారు. దేశ ఆఱ్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు ఏ పద్ధతులు అనుసరించాలనే అంశంపై వీరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.

పారిశ్రామికవేత్తలతో మోడీ భేటీ
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో దేశంలో కొత్త ఉద్యోగాలు కల్పించడం, జీడీపీని పెంచడం వంటి అంశాలపై చర్చించారు. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థికమంత్రి, ప్రధాని మోడీలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కిర్లోస్కర్ బ్రదర్స్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలోనూ పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని వారికి సూచించారు. ఆర్థిక మందగమనం భయాన్ని వదిలి ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.

పరిశ్రమపై దాడిగా చూడవద్దు...
అవినీతికి పాల్పడే కొన్ని కంపెనీలపై తీసుకుంటున్న చర్యల్ని, మొత్తం పరిశ్రమపై దాడిగా చూడవద్దని ప్రధాని మోడీ వారిని కోరారు. నిరాశ, నిస్పృహలు వీడి దేశంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారాల విస్తరణకు సిద్ధం కావాలని సూచించారు. ఇందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
పరిశ్రమవర్గాలు పారదర్శకంగా, నిర్భయంగా సంపద సృష్టించడాన్ని అనుమతించాలన్నదే తమ ఉద్దేశ్యమని, అందుకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు.

అయిదేళ్లలో చాలా మార్పులు తెచ్చాం...
చట్టాల రూపంలో ఇందుకు ఉన్న అవరోధాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోడీ అన్నారు. గత అయిదేళ్లలో పన్ను వసూళ్ల చట్టాలలో తీసుకు వచ్చిన మార్పులను ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఈ మార్పుల కోసం తమ ప్రభుత్వం నిజాయితీగా కృషి చేసిందన్నారు. పన్నుల యంత్రాంగాన్ని పారదర్శకంగా తీర్చిదిద్దడంతో పాటు జవాబుదారీతనం తెచ్చి, సిబ్బంది సామర్థ్యం పెంపుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో పెట్టుబడుల పెంపు కోసమే ఇటీవల కార్పోరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గించామన్నారు.

ఈ దశాబ్దం భారత పారిశ్రామికవేత్తలదే
ఈ దశాబ్దం భారత పారిశ్రామికవేత్తలదేనని మోడీ అన్నారు. రానున్న అయిదేళ్లలో ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. నిరాశావాదాన్ని వీడి పెట్టుబడులు పెట్టాలన్నారు. కాగా, జనవరి 9న మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ ఎక్స్‌పర్ట్స్ మీటింగ్ సమావేశం జరగనుంది.


Click it and Unblock the Notifications