Pan: పొదుపు పథకాలకు పాన్ తప్పనిసరి.. లేకుంటే ఖాతా ఫ్రీజ్..!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి పాన్, ఆధార్ నంబర్ తప్పనిసరి చేశారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ రాక ముందు ఒకరి ఆధార్ నంబర్‌ను సమర్పించకుండానే చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. ఇక నుంచి ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కనీసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. నిర్దిష్ట థ్రెషోల్డ్ కంటే ఎక్కువ పెట్టుబడిపై పాన్ కార్డును అందించాలని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం చిన్న పొదుపు చందాదారులు PPF, SSY, NSC, SCSS లేదా మరేదైనా చిన్న పొదుపు ఖాతాను తెరిచేటప్పుడు తమ ఆధార్ నంబర్‌ను సమర్పించకుంటే, 30 సెప్టెంబర్ 2023లోపు ఒకరి ఆధార్ నంబర్‌ను సమర్పించాలి. ఆధార్ నంబర్ లేకుండా చిన్న పొదుపు పథకంలో ఏదైనా తెరవాలనుకునే కొత్త చందాదారులు, ఖాతా తెరిచిన ఆరు నెలల్లోపు ఆధార్ నంబర్‌ను అందించాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఒక చిన్న పొదుపు పథకం సబ్‌స్క్రైబర్ UIDAI నుంచి అతని ఆధార్ నంబర్‌ను ఇంకా పొందకపోతే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పని చేస్తుంది.

ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్ సీడింగ్ చేయని పక్షంలో, ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత పొదుపు ఖాతా స్తంభింప చేస్తారు. ఇచ్చిన గడువులోపు పొదుపు ఖాతాతో ఆధార్ నంబర్‌ను అందించడంలో విఫలమైతే, వారి ఖాతా 1 అక్టోబర్ 2023 నుంచి ఫ్రీజ్ చేస్తారు. పొదుపు ఖాతా తెరిచే సమయంలో పాన్‌ను సమర్పించాలని నోటిఫికేషన్‌లో చేర్చారు. ఖాతా తెరిచే సమయంలో PAN సమర్పించనట్లయితే, కింది సందర్భాలలో ఖాతా తెరిచిన రెండు నెలలలోపు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఖాతాలో ఏ సమయంలోనైనా బ్యాలెన్స్ యాభై వేల రూపాయలకు మించి ఉంటే లేదా ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఖాతాలోని మొత్తం క్రెడిట్‌ల మొత్తం లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పాన్ తప్పనిసరిగా సమర్పించాలి. నిర్దిష్ట రెండు నెలల వ్యవధిలో డిపాజిటర్ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) సమర్పించడంలో విఫలమైతే, అతను ఖాతాల కార్యాలయానికి శాశ్వత ఖాతా నంబర్‌ను సమర్పించే వరకు అతని ఖాతా ఫ్రీజ్ చేస్తారు.


Click it and Unblock the Notifications