Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయాన్ని అర్థించింది. రుణం మంజూరు చేయాలంటే తమ నిబంధనలకు తలొగ్గాల్సిందేనని దాయాదిపై ఆ సంస్థ ఒత్తిడి తెస్తోంది. అది చెప్పినట్లు వినడం మినహా పాక్ ముంగిట మరో మార్గం లేదు. ఈ సమయంలో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.'

ఇప్పటికే దివాళా:
దేశం ఇప్పటికే దివాళా తీసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. పాక్ సమస్యలకు పరిష్కారం దేశంలోనే ఉందని, IMF వద్ద లేదని అభిప్రాయపడినట్లు సమా టీవీ వెల్లడించింది. ఖరీదైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెండు గోల్ఫ్ క్లబ్ లను విక్రయిస్తే మాత్రమే.. పాక్ రుణంలో నాలుగింట ఒక వంతు చెల్లించే అవకాశం ఉందని చెప్పినట్లు పేర్కొంది.

చెత్త రాజకీయాలే కారణం:
ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి బ్యూరోక్రసీ, రాజకీయ నాయకులే కారణమని ఆసిఫ్ ఆరోపించినట్లు సమా టీవీ తెలిపింది. తను 33 ఏళ్లుగా పార్లమెంటులో ఉన్నానని, అందులో 32 ఏళ్లు చెత్త రాజకీయాలనే చూశానని చెప్పినట్లు పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం ద్వారా ఆర్థిక లోటును నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారంది. అందుకుగాను అన్ని ప్రభుత్వం సంస్థల్లో పెద్ద ఎత్తున పొదుపు చర్యలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించినట్లు ఆయన వెల్లడించినట్లు ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.

ఆ భారం ఇప్పుడు ప్రజలపై..
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడవద్దని ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి మద్ధతు పలికినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. రూ.11 వేల బిలియన్లకు సంబంధించిన అవినీతి కేసులను పాలకులు మూసివేయగా.. ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలు భరిస్తున్నారని ప్రతిపక్ష నేత షాజాద్ వసీమ్ పేర్కొన్నట్లు చెప్పింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న పొదుపు చర్యల వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుందనే భయాన్ని వ్యక్తం చేసినట్లు వివరించింది.


Click it and Unblock the Notifications