Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతూనే ఉంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి నానా తంటాలు పడుతోంది. వీటికి తోడు దివాళా తీయకుండా ఉండేందుకు IMF సాయాన్ని కోరింది. ఇక ఆ సంస్థ విధించిన షరతులన్నిటికీ తల ఊపడం మినహా సొంతగా ఏ నిర్ణయం తీసుకోలేని విధంగా సతమతమవుతూ ఉంది. తాజాగా ఆ దేశ సెంట్రల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రజలను కలవరపెడుతోంది.
గతనెల మార్చిలో 35.4 శాతానికి చేరిన అధిక ద్రవ్యోల్బణ స్థాయిని తగ్గించడానికి పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకు ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నగదు కొరతతో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోగా.. ఆ దేశ కేంద్ర బ్యాంక్ మాత్రం బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచింది. 100 బేసిస్ పాయింట్ల వడ్డింపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) కీలక రేటు ఇప్పుడు రికార్డు స్థాయిలో 21 శాతానికి చేరింది.

పెరుగుతున్న నిత్యావసరాలు రేట్లు, అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు తీసుకున్న చర్యలు తప్పడంలేదని SBP పేర్కొంది. ధరల స్థిరత్వాన్ని సాధించడంలో ఈ నిర్ణయం కీలకం కానున్నట్లు ప్రకటించింది. దేశంలో సంక్షోభ పరిస్థితి మెరుగవుతోందని, ఆర్థిక కార్యకలాపాలు సైతం ఊపందుకున్నాయని వెల్లడించింది. ఇందుకు తోడు దిగుమతుల నియంత్రణ వల్ల కరెంట్ ఖాతా లోటు సైతం గణనీయంగా తగ్గిందని మానిటరీ పాలసీ కమిటీ(MPC) తెలిపింది.
విదేశీ మారకపు నిల్వలు మాత్రం దేశంలో ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉన్నాయని MPC వెల్లడించింది. అందుకే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఒత్తిడిలో కొనసాగుతున్నట్లు అంగీకరించింది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు.. IMF సూచించిన EFF కింద 9వ సమీక్షను పూర్తి చేసే దిశగా గొప్ప పురోగతి సాధించినట్లు ప్రకటించింది. గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇటీవల ఏర్పడిన ఒత్తిళ్లు సైతం అభివృద్ధి చెందుతున్న పాకిస్థాన్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థల కష్టాలను మరింత పెంచినట్లు అభిప్రాయపడింది.


Click it and Unblock the Notifications