రూపాయి కోసం కోర్టు మెట్లు ఎక్కిన కస్టమర్.. రూ.7,500 వెంటనే చెల్లించాలని రిటైలర్‌కు కోర్టు ఆదేశం..
Online Shopping Shock: ఆన్‌లైన్ షాపింగ్ రీఫండ్ల విషయంలో ఒక్క రూపాయి తక్కువైనా వినియోగదారులు నిర్లక్ష్యం చేయకూడదని హర్యానాలో వెలువడిన ఒక కీలక తీర్పు నిరూపించింది. రీఫండ్ మొత్తంలో కేవలం ఒక రూపాయిని తమ సొంత డిజిటల్ వాలెట్‌లో జమ చేసిన ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌పై పంచకుల జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మొత్తం రూ. 7,500 జరిమానా విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
పంచకులకు చెందిన 24 ఏళ్ల మహిళ 2026 జనవరి 23, జనవరి 25 తేదీలలో ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కిరాణా సామాను ఆర్డర్ చేశారు. మొదటి ఆర్డర్ విలువ రూ. 319 కాగా, రెండవ ఆర్డర్ విలువ రూ. 116గా ఉంది. అయితే, ఈ రెండు ఆర్డర్లలోనూ ఆమె బుక్ చేసిన ఒక చాక్లెట్ ఐటమ్ డెలివరీ కాకపోవడంతో, కంపెనీ ప్రతి ఆర్డర్‌కు రూ. 19 చొప్పున రీఫండ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

కానీ, ఆమె బ్యాంక్ ఖాతాలోకి రెండుసార్లూ కేవలం రూ. 18 మాత్రమే జమ కాగా.. మిగిలిన రూ. 1 కంపెనీ యొక్క డిజిటల్ రివార్డ్స్ వాలెట్‌లో జమ అయింది. తన అనుమతి లేకుండా రీఫండ్ మొత్తాన్ని వాలెట్‌లో వేయడమే కాకుండా.. ఈ నిబంధన గురించి కంపెనీ ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 3న యాప్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో.. ఆమె కంపెనీకి లీగల్ నోటీసు పంపి ఆపై వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన పంచకుల జిల్లా వినియోగదారుల కమిషన్ అక్టోబర్ 28న కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలు, కంపెనీ డిజిటల్ రివార్డ్స్ వాలెట్‌లు పూర్తిగా వేర్వేరు అని కమిషన్ స్పష్టం చేసింది. వినియోగదారుడి ముందస్తు సమ్మతి లేకుండా రీఫండ్ మొత్తంలో కొంత భాగాన్ని వాలెట్‌లో జమ చేయడం చట్టవిరుద్ధమని, ఈ ఏర్పాటుకు వినియోగదారుడు అంగీకరించినట్లు కంపెనీ ఎటువంటి ఆధారాలను చూపలేకపోయిందని పేర్కొంది.
వాలెట్‌లో డబ్బు జమ చేయడం వల్ల వినియోగదారుడు ఆ డబ్బును వాడుకోవడానికి మళ్లీ అదే ప్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేయాల్సిన ఒత్తిడి ఏర్పడుతుందని, ఇది వినియోగదారుడి ఆర్థిక స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కమిషన్ అభిప్రాయపడింది.
దీనిని సేవలో లోపంగా (Deficiency in Service), అన్యాయమైన వ్యాపార పద్ధతిగా (Unfair Trade Practice) పరిగణించిన కమిషన్.. డార్క్ ప్యాటర్న్స్‌పై (Dark Patterns) 2023 మార్గదర్శకాలను సైతం ఉటంకిస్తూ రిటైలర్‌ను తప్పుబట్టింది. చివరగా, బాధిత మహిళకు మానసిక వేదన మరియు ఖర్చుల నిమిత్తం రూ. 2,500 నష్టపరిహారం చెల్లించాలని, అలాగే హర్యానా రాష్ట్ర ఉచిత న్యాయ సహాయ కమిషన్‌లో రూ. 5,000 జమ చేయాలని (మొత్తం రూ. 7,500) ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.


Click it and Unblock the Notifications
