శవాల సంచులు లెక్కించడం కాదు.. యుద్ధం ఎలా గెలవాలో ప్రపంచానికి నేర్పించడమే ఆపరేషన్ సింధూర్..
లక్ష్యాన్ని ఛేదించడమే మన పని, శవాల సంచులను లెక్కించడం కాదు. భారత వైమానిక దళ ఎయిర్ మార్షల్ ఏకే భారతి పలికిన ఈ మాటలు కేవలం ఒక ప్రకటన కాదు, అది నవ భారత సైనిక వ్యూహానికి నిదర్శనం. సరిగ్గా ఏడాది క్రితం 2025 మే 7న ప్రారంభమైన Operation Sindoor .. భారతదేశం తన శత్రువుల పట్ల అనుసరించే వైఖరిలో వచ్చిన పెను మార్పుకు సంకేతంగా నిలిచింది.
భారతదేశంపై జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా మొదలైన ఈ ఆపరేషన్, తొలి దశలో పరిమితంగానే సాగింది. అయితే, పాకిస్తాన్ భారత నగరాలు. సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో యుద్ధ గమనం మారిపోయింది. అప్పటి వరకు రక్షణ ధోరణిలో ఉన్న భారత్, ఒక్కసారిగా 'ఆక్రమణే ఉత్తమ రక్షణ' అనే సిద్ధాంతాన్ని స్వీకరించింది.

2025 మే 10 తెల్లవారుజామున భారత వైమానిక దళం ప్రచండ విక్రమాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్‌లోని కీలక వైమానిక స్థావరాలైన రఫిక్వీ, మురీద్, సుక్కూర్, సియాల్‌కోట్ వంటి కేంద్రాలపై మెరుపు దాడులు జరిగాయి. ఇవి కేవలం ప్రతీకాత్మక దాడులు కావు. శత్రువు యొక్క కమాండ్, లాజిస్టిక్స్, రన్‌వేలను క్షణాల్లో ధ్వంసం చేసి, వారి వైమానిక ప్రతిస్పందన సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసిన 'కచ్చితత్వపు దాడులుగా చెప్పవచ్చు.
యూరోపియన్, అమెరికన్ థింక్ ట్యాంక్‌ల విశ్లేషణ ప్రకారం.. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం యుద్ధ విమానాల ప్రదర్శన కాదు, అది ఒక నెట్‌వర్క్ సెంట్రిక్ వార్‌ఫేర్. భారత్ ఈ ఆపరేషన్‌లో ఒక సమన్వయ వ్యవస్థను అమలు చేసింది. గగనతలం నుండి నిరంతర పర్యవేక్షణతో పాటుగా శత్రువు యొక్క కీలక ఆస్తులను మాత్రమే గురిచూసి కొట్టడం చేసింది.
అలాగే ఆకాశ్ రక్షణ వ్యవస్థ,బ్రహ్మోస్ క్షిపణుల ద్వారా శత్రువు యొక్క వాయు రక్షణను అణచివేయడం వంటి చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముషాఫ్ వైమానిక స్థావరం సమీపంలోని వ్యూహాత్మక భూగర్భ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం, శత్రువు యొక్క అణు నిరోధక శక్తికి ఒక పరోక్ష హెచ్చరికగా నిలిచిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఆపరేషన్ సింధూర్ ఇచ్చిన అతిపెద్ద పాఠం ఏంటంటే.. డ్రోన్‌ల ప్రాముఖ్యత. గతంలో డ్రోన్‌లను కేవలం నిఘా కోసం వాడేవారు. కానీ ఇక్కడ అవి యుద్ధంలో అంతర్భాగమయ్యాయి. స్వదేశీ సాంకేతికతతో తయారైన ALS-50 వంటి లోయిటరింగ్ మ్యూనిషన్స్ (Loitering Munitions) గాలిలో గస్తీ తిరుగుతూ, లక్ష్యాలను గుర్తించి, కచ్చితత్వంతో ధ్వంసం చేయడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచాయి.
మేజర్ జనరల్ ఆర్.సి. పధి (రిటైర్డ్) అన్నట్లుగా.. భారతదేశం ఇప్పుడు ఈగిల్ ఇన్ ది ఆర్మ్ సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అంటే, ప్రతి సైనికుడికి, ప్రతి బెటాలియన్‌కు డ్రోన్ అనేది ఒక అదనపు కన్ను, అస్త్రంలా మారిపోయింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (TASL) వంటి సంస్థల భాగస్వామ్యం ఈ 'ఆత్మనిర్భర్' విజయానికి వెన్నెముకగా నిలిచింది.
ఆపరేషన్ ముగిసిన ఏడాది తర్వాత, నేడు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నట్లుగా, భారత్ ఇప్పుడు సాంకేతికత ఆధారిత సైనిక శక్తి. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సరిహద్దు ఘర్షణగా మిగిలిపోలేదు. అది భారత సైనిక సిద్ధాంతాన్ని (Military Doctrine) పునర్లిఖించింది. నేడు భారతదేశం గత యుద్ధాల పాఠాలను చదవడం లేదు, భవిష్యత్తు యుద్ధాలను ఎలా గెలవాలో ప్రపంచానికి నేర్పిస్తోంది. వేగం, కచ్చితత్వం, స్వదేశీ సాంకేతికతే ప్రాతిపదికగా సాగుతున్న ఈ ప్రయాణంలో 'ఆపరేషన్ సింధూర్' ఒక నిరంతర ప్రేరణ.


Click it and Unblock the Notifications
