రష్యా-సౌదీ ధరల యుద్ధానికి ఫుల్‌స్టాప్, చమురు ఉత్పత్తి తగ్గింపు, ధరల పెరుగుదల
ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ తగ్గింది. దీనికి తోడు గత కొద్ది రోజులుగా రష్యా, సౌదీ అరేబియాల మధ్య ధరల యుద్ధం సాగింది. దీంతో చమురు ధరలు భారీగా పడిపోయాయి. గురువారం సౌదీ, రష్యా, ఒపెక్ దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి తగ్గించేందుకు అన్ని దేశాలు అంగీకరించాయి. ఉత్పత్తి తగ్గించేందుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ధరలు ఇక పెరిగే అవకాశముంది.

10 బిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి తగ్గింపు
ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC), మిత్రదేశాలు, రష్యా సహా అన్ని కూడా రోజుకు 10 మిలియన్ బ్యారెల్స్ క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించాయి. మే నెల నుండి ఈ మొత్తం తగ్గించాలని అంగీకరానికి వచ్చాయి. కరోనా మహమ్మారికి ముందు 10 మిలియన్ బ్యారెల్స్ (bpd) అంటే గ్లోబల్ సప్లైలో ఇది 10శాతం.

అమెరికా కూడా అంగీకరిస్తే..
యునైటెడ్ స్టేట్స్ కూడా మరో 5 మిలియన్ బ్యారెల్స్ (bpd) ఉత్పత్తిని తగ్గిస్తుందని ఒపెక్, మిత్ర దేశాలు భావిస్తున్నాయి. ఒకవేళ అమెరికా కూడా దీనికి అంగీకరిస్తే ఈ దేశాల ఉత్పత్తి భారీగా తగ్గనుంది. కరోనాకు ముందు ప్రపంచ దేశాలకు అవసరమైన 30 శాతం ఉత్పత్తిలో సగానికి పైగా పడిపోనుంది.

పెరిగిన క్రూడ్ ధర
రష్యా, సౌదీ, ఒపెక్ దేశాలు ఉత్పత్తి తగ్గించేందుకు అంగీకరానికి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో గురువారం చమురు ధరలు 12 శాతం పెరిగాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ బ్యారెల్‌కు 12 శాతం పెరిగి 28.36 డాలర్లు పలికింది. బ్రెంట్ క్రూడాయిల్ 11 శాతం పెరిగి 36.40 డాలర్లు పలికింది.


Click it and Unblock the Notifications