LPG Cylinder Prices: ప్రతి నెల మెుదటి తారీఖున గ్యాస్ ధరల వివరాలను చమురు కంపెనీలు అప్ డేట్ చేస్తుంటాయి. కమర్షియల్, గృహ వినియోగ సిలిండర్ల ధరలు ప్రజల జేబుపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే చమురు కంపెనీలు ఈ సారి ధరల విషయంలో తీసుకున్న మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వరుస తగ్గింపులు..
గడచిన మూడు నాలుగు నెలల కాలంలో వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గిస్తూ వచ్చాయి. అయితే ఈ సారి కూడా ఆ ఊరట లభిస్తుందని చాలా మంది ఆశించారు. అందరి అంచనాలకు భిన్నంగా కంపెనీలు ధరల్లో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల ధరలు స్థిరంగా గత నెల ధరలనే కొనసాగిస్తున్నాయి.

ఇండియన్ ఆయిల్ ధరలు..
19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దిల్లీ మహానగరంలో రూ.1744, ముంబై నగరంలో రూ.1,696, చెన్నైలో సిలిండర్ ధర రూ.1,893, కోల్‌కతాలో రూ.1,846 వద్ద కమర్షియల్ సిలిండర్ల ధరలు కొనసాగుతున్నాయి.

బాధలో గృహ వినియోగదారులు..
డొమెస్టిక్ సిలిండర్ల ధరల విషయంలో చాలా నెలలుగా ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పటికే ద్రవ్యోల్బణంతో బాధపడుతూ గ్యాస్ ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్నారు. కానీ వారి ఆశలపై చమురు కంపెనీలు ఈ సారి కూడా నీళ్లు చల్లాయి. దీంతో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,053, కోల్‌కతాలో రూ.1,079, చెన్నైలో 1,068.50, ముంబైలో రూ.1,052 స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం గతంలో అందించే సబ్సిడీని ఎత్తివేయటం తమకు భారంగా మారిందని చాలా మంది గ్యాస్ వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.

2022లో జరిగింది ఇదే..
2022లో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ రేటును చమురు కంపెనీలు కేవలం 5 సార్లు మాత్రమే మార్చాయి. అయితే ఈ ఐదు సార్లు ధరలను కంపెనీలు పెంచేందుకు మాత్రమే వినియోగించాయి. అయిగే వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు మెుత్తంగా 11 సార్లు తగ్గించాయి. అంటే ఈ ఏడాది సామాన్యులకు గ్యాస్ భారం పెరిగిందని చెప్పుకోవచ్చు. రానున్న ఏడాది సైతం ఇదే ధోరణిని కొనసాగిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.

కమర్షియల్ తగ్గింపులు..
జూలైలో సిలిండర్ పై ధర రూ.9 మేర తగ్గింది. అంతకుముందు.. జూన్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ.198 తగ్గింది. ఆగస్టులో రూ.36, సెప్టెంబర్ మాసంలో రూ.100, అక్టోబర్ నెలలో రూ.25.50 తగ్గింపు వచ్చింది. నవంబర్ నెలలో కంపెనీలు రూ.115.50 తగ్గింపు ప్రకటించటంతో.. మెుత్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ ధర రూ.619 తగ్గింది. అయితే ఏడాది చివరి నెల మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు.


Click it and Unblock the Notifications