భారతదేశం-యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య పలు దశల చర్చల అనంతరం ఓ కీలక మైలురాయి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) చివరి దశలోకి వచ్చింది. అధికారికంగా వచ్చే వారం ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి యూకేకు వెళ్లే దాదాపు 99% ఉత్పత్తులపై దిగుమతి పన్నులు (Import Duties) పూర్తిగా తొలగించబడతాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, చర్మ ఉత్పత్తులు, పాదరక్షలు, జ్యువెలరీ వంటి ఎగుమతులపై ఇది అమలవుతుంది. ఈ రంగాల్లో పనిచేసే లక్షలాది మందికి ఇది గొప్ప ఊరట. చిన్న పరిశ్రమలకు ఇది పెద్ద అవకాశం.

ఇక భారత వినియోగదారులకూ మంచి వార్తే. యూకే నుంచి దిగుమతయ్యే విస్కీ, లగ్జరీ కార్లు వంటి వస్తువులపై దిగుమతి పన్నులు భారీగా తగ్గబోతున్నాయి. ఉదాహరణకు, ప్రస్తుతం బ్రిటన్ విస్కీపై భారత్ వసూలు చేస్తున్న 150% దిగుమతి పన్ను, ఈ ఒప్పందం అమలవుతూనే 40%కి తగ్గించనుంది.
అలాగే బ్రిటన్ కార్లపై ఉన్న 100%కు పైగా ట్యాక్స్‌ను కేవలం 10% గా తగ్గించే అవకాశం ఉంది. అంటే, BMW, Jaguar వంటి కార్లు ఇప్పుడు ఎంత ఖరీదుగా ఉన్నా వచ్చే ఏడాదిలో వాటి ధరలు అనూహ్యంగా తగ్గే అవకాశముంది.
ఒప్పందంపై వచ్చే వారం సంతకం అయినా, అది వెంటనే అమలవదు. రెండు దేశాల పార్లమెంట్లు, కేబినెట్ల నుంచి అధికారిక ఆమోదం అవసరం ఉంటుంది. అంతేకాక, లీగల్ స్క్రబ్బింగ్ అనే ప్రక్రియలో ఒప్పంద పాఠ్యాన్ని న్యాయ పరంగా పటిష్టంగా తయారు చేస్తారు. అందుకే ఈ ఒప్పందం పూర్తిగా అమలులోకి రావడానికి సుమారు ఏడాది పట్టే అవకాశముంది.
రెండు దేశాలకు దీని ప్రయోజనం ఇవే:
ఈ FTA ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వర్తకాల విలువను $120 బిలియన్లకు రెట్టింపు చేయాలని భారత్, యూకే ఆశిస్తున్నాయి. వస్తువులు మాత్రమే కాకుండా పెట్టుబడి, వృత్తిపరమైన మార్పిడి, టెక్నాలజీ సేవల్లో మరింత వృద్ధి ఇక్కడ లక్ష్యం.
ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, రెండు దేశాల్లో ఉద్యోగాలు పెరగడం, వేతనాలు పెరగడం వంటి ఇతర సానుకూల ప్రభావాలు కనిపించబోతున్నాయి. అధిక వినియోగ రంగాలు, తయారీ, సేవలు, హై-ఎండ్ రిటెయిల్ రంగాల వారికి కొత్తగా వ్యాపార అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఒప్పందం ఒక సాధారణ ఇంటర్నేషనల్ డీల్ కాదు. ఇది రెండు దేశాల భవిష్యత్తుకు దారితీసే వేదిక. చిన్న కార్మికుడి నుంచి బ్రాండ్ వ్యాపారవేత్తవరకూ దీని ప్రభావం పడ్డే అవకాశం ఉంది. భారత యువతకు ఉపాధి, నైపుణ్యాలు, విదేశీ అవకాశాలు అన్నిటిలోనూ ఇది ఒక కొత్త తలుపు తెరుస్తోంది.


Click it and Unblock the Notifications