2025 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 13న ప్రకటించారు. ఈసారి ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని ప్రపంచ ఆర్థిక శాస్త్ర రంగంలో కీలకమైన మార్పులు తీసుకువచ్చిన ముగ్గురు ఆర్థికవేత్తలు.. జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియోన్, పీటర్ హోవిట్ కు వరించింది. ఈ బహుమతి ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధి" (Innovation-driven economic growth) పట్ల వీరి విశేష కృషికి గుర్తింపుగా ప్రదానం చేయబడింది. ఈ ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ సీజన్ అధికారికంగా ముగిసింది.
బహుమతిలో సగం జోయెల్ మోకిర్ కు లభించింది. ఆయన పరిశోధనలు సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధికి అవసరమైన మూల సూత్రాలను గుర్తించాయి. మిగిలిన సగం ఫిలిప్ అఘియోన్, పీటర్ హోవిట్ లకు కలిసి లభించింది, వీరు సృజనాత్మక విధ్వంసం (Creative Destruction) అనే ఆర్థిక సిద్ధాంతానికి గణిత మోడల్ రూపాన్ని ఇచ్చారు.

అఘియోన్, హోవిట్ ఇద్దరూ 1992లో ప్రచురించిన తమ ప్రసిద్ధ వ్యాసంలో సృజనాత్మక విధ్వంసం అనే భావనను గణితపరంగా వివరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం, కొత్త ఆవిష్కరణలు మార్కెట్లో పాత సాంకేతికతలను పక్కనబెడతాయి, ఫలితంగా కొత్త పరిశ్రమలు, కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తాయి. అంటే, ఆవిష్కరణలు అభివృద్ధిని తెస్తూనే పాత వ్యవస్థలను క్రమంగా తొలగిస్తాయి. ఈ చక్రం.. పాతది పోతూ, కొత్తది రావడం అనే దానిపై ఆధారపడగా ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధికి మూలం అని వారు నిరూపించారు.
అమెరికాకు చెందిన జోయెల్ మోకిర్ ఆర్థిక చరిత్రలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన పరిశోధన పారిశ్రామిక విప్లవం (Industrial Revolution) ఎలా ప్రారంభమైందో, అది ఎలా నిరంతర వృద్ధికి దారి తీసిందో వివరించింది. ఆయన ప్రకారం, సాంకేతిక ఆవిష్కరణల వెనుక ఉన్న శాస్త్రీయ వివరణలే ఆర్థిక వృద్ధిని దీర్ఘకాలం కొనసాగించడానికి సహాయపడ్డాయి.అతను సమాజం కొత్త ఆలోచనలను, మార్పులను స్వీకరించే సంస్కృతి అవసరమని కూడా హైలైట్ చేశారు. ఆయన దృష్టిలో, ఆవిష్కరణల విజయానికి జ్ఞానం, సామాజిక అంగీకారం రెండూ కీలకమని చెప్పారు.
ఆర్థిక శాస్త్ర Nobel Prizeని అధికారికంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆర్థిక శాస్త్రాలలో స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ బహుమతిగా పిలుస్తారు. 1968లో స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఈ అవార్డును స్థాపించింది. ఇది అసలు ఐదు నోబెల్ అవార్డుల తర్వాత జోడించబడిన ఆరవ విభాగం. ఈ బహుమతిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా స్టాక్‌హోమ్‌లో ప్రదానం చేస్తారు.
2024లో ఈ బహుమతిని ఆర్థికవేత్తలు డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ. రాబిన్సన్ అందుకున్నారు. వీరి పరిశోధనలు అన్నీ ఎందుకు కొన్ని దేశాలు సంపన్నంగా ఉన్నాయో, మరికొన్ని దేశాలు ఎందుకు పేదగా ఉన్నాయో వివరిస్తూ ప్రజాస్వామ్యం, బహిరంగత, స్వేచ్ఛ ఆర్థిక అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయో వివరించాయి.


Click it and Unblock the Notifications