న్యూఢిల్లీ: 2016 నవంబర్ నెలలో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటును ఉపసంహరించుకోనున్నట్లు ఇటీవల ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈ ప్రచారాన్ని కొట్టి పారేశారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

రూ.2,000 నోటుపై ప్రశ్నించిన ఎంపీ
మంగళవారం రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ ఎంపీ విశ్వంబర ప్రసాద్ నిషద్ రూ.2,000 నోట్ల అంశాన్ని ప్రస్తావించారు. రూ.2వేల నోట్ల తీసుకు వచ్చిన తర్వాత దేశంలో నల్లధనం పెరిగిందన్నారు. రూ.2,000 నోటు తీసుకు వచ్చి కేంద్రం తప్పు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రూ.2,000 నోట్ల స్థానంలో తిరిగి రూ.1,000 నోట్లు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్లుగా వార్తలు వస్తున్నట్లు తెలిపారు. దీనిపై అనురాగ్ ఠాకూర్ స్పందించారు.

ఆందోళన వద్దు.. అందుకే నోట్ల రద్దు
రూ.2వేల నోటు విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఠాకూర్ తెలిపారు. నల్లధనాన్ని అరికట్టడం, నకిలీ కరెన్సీని నిర్మూలించడం, ఉగ్రవాదులు, అతివాదుల ఆఱ్థిక మార్గాలకు అడ్డుకట్ట వేయడం, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సహించడం తదితర లక్ష్యాలతో పెద్ద నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయన్నారు. చలామణిలోని నగదు విలువ పెరిగిందని చెప్పారు. అలాగే పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ కూడా పట్టుబడిందన్నారు.

రూ.2000 నోట్ల రద్దు ప్రచారంతో...
గత కొంతకాలంగా రూ.2,000 నోటు రద్దవుతుందనే ప్రచారం సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలలో రూ.2,000 నోట్లు తగ్గించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల VRL ట్రాన్సుపోర్ట్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లు తీసుకోవద్దంటూ సర్కులర్ ను జారీ చేసింది. వీఆర్ఎల్‌కు సంబంధించి ఆ సంస్థకు చెందిన లాజిస్టిక్, ప్రయివేటు బస్సు సర్వీసుల్లో రూ.2000 నోట్లు చెల్లవు. త్వరలో ఆ నోట్లు రద్దయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తుండటం వల్లే ఈ సర్కులర్‌ను జారీ చేసినట్లు తెలుస్తోందని వార్తలు వచ్చాయి. అదే సమయంలో రూ.2,000 నోట్లను రద్దు చేయనప్పటికీ కొత్త నోట్లు తీసుకురావడం ఆపేసిందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications