AI చూసి భయపడకండి.. ఉద్యోగాలు ఊడటం లేదు, ఇంకా పెరుగుతున్నాయి! అసలు నిజం ఇదీ!
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే భయం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చేస్తే సాఫ్ట్‌వేర్, ఇతర రంగాల ఉద్యోగాలు ఊడిపోతాయేమో అని! చాలా కంపెనీలు ఉద్యోగులను తీసేస్తూ.. దానికి AI ని కారణంగా చూపుతుండటంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. కానీ, ప్రముఖ గ్లోబల్ మేనేజ్‌మెంట్ సంస్థ 'అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్' చీఫ్ ఎకనామిస్ట్ టోర్స్టన్ స్లోక్ మాత్రం ఇదంతా అబద్ధం అంటున్నారు. AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయనడానికి రూపాయి ఆధారాల్లేవని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగాలు పోవట్లేదు.. ఇంకా పెరుగుతున్నాయి!
టోర్స్టన్ స్లోక్ తన తాజా బ్లాగ్ పోస్ట్‌లో డేటాతో సహా కీలక విషయాలు వెల్లడించారు. కంపెనీలు ఉద్యోగులను తీసేయడం లేదు సరే కదా.. AI ని తమ బిజినెస్‌లో ఎలా వాడాలో తెలిసిన నిపుణుల కోసం ఎగబడుతున్నాయట. దీనివల్ల డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎనర్జీ రంగాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరిగి, శాలరీలు కూడా భారీగా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.
జెవాన్స్ పారడాక్స్ (Jevons Paradox) అంటే ఏంటి?
"గతంలో స్టీమ్ ఇంజన్లు వచ్చినప్పుడు బొగ్గు వాడకం తగ్గుతుందని అందరూ అనుకున్నారు. కానీ సాంకేతికత చౌకగా మారడంతో బ్రిటన్ మరింత ఎక్కువ బొగ్గును వాడింది. ఇప్పుడు AI విషయంలోనూ ఇదే జరుగుతోంది. టెక్నాలజీ చౌకగా మారేకొద్దీ డిమాండ్ పెరిగి, మరిన్ని కొత్త ఉద్యోగాలు వస్తాయి." అని స్లోక్ వివరించారు.
టెక్ దిగ్గజాలు ఏమంటున్నారు?
ఓపెన్AI సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ కూడా తన పాత అంచనాలు తప్పని ఒప్పుకున్నారు. జనాలు అనుకున్నంతగా AI వల్ల ఉద్యోగ నష్టాలు జరగలేదని, ముఖ్యంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. అటు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కూడా దీనిపై స్పందించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, రేడియాలజీ లాంటి రంగాలు AI వల్ల అంతమైపోవన్నారు. AI కొన్ని పనులను సులువు చేయగలదు కానీ, అసలు సమస్య ఏంటో కనిపెట్టడం, క్రియేటివ్‌గా ఆలోచించడం కేవలం మనుషులకే సాధ్యమని ఆయన నమ్మకంగా చెప్పారు. కోడింగ్ రాయడం అనేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో ఒక భాగం మాత్రమే, ఏం నిర్మించాలి, ఎందుకు నిర్మించాలి అని ఆలోచించేది మనుషులే అని గుర్తు చేశారు.
మరి ఈ లేఆఫ్స్ (Layoffs) గోల ఏంటి?
సిస్కో, అట్లాసియన్, క్లౌడ్‌ఫ్లేర్, విక్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు రీసెంట్‌గా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అయితే వీటన్నింటికీ AI కారణం కాదని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మండిపడ్డారు. చాలామంది సీఈఓలు కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడానికో, లేదా ఇతర బిజినెస్ నష్టాల వల్లో ఉద్యోగులను తీసేస్తూ.. చాలా బద్ధకంగా ఆ నెపాన్ని AI మీద నెట్టేస్తున్నారని (AI Washing) విమర్శించారు. మన జోహో (Zoho) ఫౌండర్ శ్రీధర్ వెంబు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లు, ఇన్వెస్టర్ల డిమాండ్ల వల్లే కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి తప్ప, AI వల్ల కాదని తేల్చి చెప్పారు. కాబట్టి లేఆఫ్స్ (layoffs) చూసి భయపడాల్సిన పనిలేదు, మన స్కిల్స్ పెంచుకుంటే చాలు!


Click it and Unblock the Notifications