జ్యూరిచ్: నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నల్లధనం రూపుమాపేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను తెప్పించుకుంటోంది. గత నెలలో స్విస్ బ్యాంకులో ధనం దాచుకున్న భారతీయ ఖాతాదారుల ఫస్ట్ లిస్ట్ భారత్‌కు చేరుకుంది. తాజాగా, 12 ఖాతాలు ఎవరికి చెందినవో తెలియకుండా ఉంది. స్విస్ బ్యాంకులో భారత్‌కు చెందిన 12 ఖాతాలు నిద్రాణ దశలో ఉన్నాయి. ఈ అకౌంట్లు తమవే అని ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదట.

ఆధారాలతో రండి.. లేదా డబ్బులు మా ఖాతాలోకి..
ఈ 12 ఖాతాలకు చెందిన సొమ్ము తమదేనని ఎవరూ ముందుకు రాకుంటే ఆ ఖాతాల్లోని సొమ్ము అంతా తమ ప్రభుత్వ ఖజానాకు చేరుకుంటుందని స్విట్జర్లాండ్ అధికారులు వెల్లడించారు. ఈ ఖాతాలకు చెందిన వ్యక్తులు లేదా వారి వారసులు సరైన ఆధారాలతో రావాలని, లేదా ఆ ఖాతాలు క్లోజ్ చేసి ఆ డబ్బులు మా ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటామన స్విస్ అధికారులు హెచ్చరించారు.

క్లోజ్ చేసే అవకాశమున్న ఖాతాలు 2600
ఇలా క్లోజ్ చేసే ప్రమాదం ఉందని భావిస్తున్న వాటిల్లో 2,600 స్విస్ బ్యాంకు ఖాతాల్లో 2015 నాటికి దాదాపు 45 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ ఉన్నట్లుగా అంచనా. మన కరెన్సీలో దాదాపు రూ.300 కోట్లు. మొత్తంగా 3500 వరకు ఖాతాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భారతీయులవి 12 ఖాతాలు ఉన్నాయి. కానీ ఎవరూ కూడా అవి తమ ఖాతాలు అని ముందుకు రాలేదు.

వచ్చే నెలలో ముగియనున్న కాలపరిమితి
ఈ ఖాతాల్లో బ్రిటిష్ పాలన నాటి ఖాతాలు కూడా ఉన్నాయి. గత ఆరేళ్లుగా ఈ ఖాతాలు ఈ ఖాతాలు తమవేనని స్విస్ అధికారులకు సమాచారం రాలేదట. ఇందులో కొన్నింటి కాలపరిమితి ఈ నెల, మరికొన్నింటి ఖాతాల కాలపరిమితి వచ్చే నెల తీరనుంది.

ఈ ఖాతాలు క్లోజ్ అయ్యే అవకాశం
ఈ నెల 15వ తేదీన లీలా తాలుక్‌దార్, ప్రమతా ఎన్ తాలూక్‌దార్ ఖాతాల కాలపరిమితి ముగియనుందట. కిశోర్ లాల్, మోహన్ లాల్, చంద్రలత ప్రణ్‌లాల్ పటేల్ ఖాతాలకు డెడ్ లైన్ డిసెంబర్‌తో ముగియనుందట. ఈ లోగా ఆస్తులు, నగదు కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునని స్విస్ అధికారులు చెబుతున్నారు. కోల్‌కతాకు చెందిన ఇద్దరు, డెహ్రాడూన్‌కు చెందిన ఒక్కరు, ముంబైకి చెందిన ఇద్దరు ఈ జాబితాలో ఉండగా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో స్థిరపడినవారు కూడా ఉన్నారు. మరిన్ని ఖాతాలను క్లెయిమ్ చేసుకోవడానికి 2020 చివరి వరకు సమయం ఉందని తెలుస్తోంది.

అలా స్విస్ ఖాతాలోకి అమౌంట్
స్విస్ బ్యాంక్ నిబంధనల ప్రకారం 60 ఏళ్ల నుంచి ఖాతాదారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోతే ఆ ఖాతాను నిద్రాణంగా ఉన్న ఖాతాలుగా పరిగణిస్తారు. ఈ ఖాతాల్లో కనీసం 500 ఫ్రాంక్స్ డిపాజిట్ లేదా విలువ తెలియని ఆస్తులు ఉంటే క్లెయిమ్స్‌ను ఆహ్వానిస్తారు. స్విస్ 2015 నుంచి ఇలాంటి నిద్రాణ బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడిస్తోంది. వీటి ఓనర్లు లేదా వారసులు ఆధారాలతో ముందుకు వస్తే ఆ డిపాజిట్స్ అప్పగిస్తారు. ఖాతాల్లోని డిపాజిట్‌ను బట్టి అలా వచ్చే వారి కోసం అయిదేళ్ల వరకు సమయం ఇస్తారు. ఆధారాలు చూపించకుంటే ఆ మొత్తం స్విస్ ఖాతాలోకి వెళ్తుంది.


Click it and Unblock the Notifications