ముంబై: దేశీయ పౌర విమానయాన రంగంలో కొత్తగా అడుగు పెట్టిన ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్స్ సంస్థ తన సేవలను మరింత విస్తరించింది. విమాన సర్వీసులను మరిన్ని అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ప్రత్యేకించి- దేశ ఈశాన్య రాష్ట్రాలకు ఎయిర్ కనెక్టివిటీని కల్పిస్తూ తెర మీదికి వచ్చిన కొత్త పౌర విమానయాన సంస్థ ఇది. తాజాగా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో టై అప్ అయింది. ఫ్లైబిగ్ విమానాల్లో రాకపోకలు సాగించడానికి అవసరమైన టికెట్లను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన అగ్రిమెంట్ ఇది.
అస్సాంలోని తేజు, రూప్సీ, అరుణాచల్ ప్రదేశ్‌లోని పాశీఘాట్, అగర్తలా, దిబ్రూగఢ్, కోల్‌కత మధ్య విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అస్సాంలోని లీలాబరి, నార్త్ లఖీంపూర్ నుంచి కోల్‌కతకు ఎయిర్ కనెక్టివిటీని కల్పించనుంది. ఈ నెల 31వ తేదీన కోల్‌కత-లీలాబరి, కోల్‌కత-నార్త్ లఖీంపూర్ మధ్య విమాన సర్వీసులకు విమానాలను నడిపించనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పర్చాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఫ్లైట్ సర్వీసులను నడిపిస్తున్నట్లు తెలిపింది.

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా టికెట్ల బుకింగ్ సేవలను సరళీకరించడంలో భాగంగా ఐఆర్‌సీటీసీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దేఖో అప్నా దేశ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్స్‌తో టికెట్ల బుకింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారి పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి తగ్గిందని, దాన్ని పునరుద్ధరించడానికి ఈ అగ్రిమెంట్ దోహదపడుతుందని ఫ్లైబిగ్ ఫైనాన్స్ డైరెక్టర్ చందర్ బహుదూర్ తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంటోన్న ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరుగా ఉంటూ వస్తోన్న పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేలా ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్ తన విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిందని, టికెట్ల జారీని సరళీకరించడానికి ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారి చెప్పారు.


Click it and Unblock the Notifications