ఉద్యోగులకు గుడ్ న్యూస్! కొత్త లేబర్ కోడ్‌లతో మీ జీతం తగ్గుతుందా? స్పష్టత ఇచ్చిన కేంద్రం!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్స్ (New Labour Codes) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల్లో ఒక ఆందోళన మొదలైంది.. పీఎఫ్ (Provident Fund) మినహాయింపుల నిబంధనలు మారడం వల్ల తమ టేక్-హోమ్ సాలరీ (Take-Home Salary) తగ్గుతుందా? అని. ముఖ్యంగా వేతనాలు, అలవెన్సులు, పీఎఫ్ లెక్కలపై ఇంటర్నెట్‌లో చాలా గందరగోళం నెలకొంది. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే, పీఎఫ్ వాటా చట్టబద్ధమైన వేతన పరిమితి (Statutory Wage Ceiling) ఆధారంగా లెక్కించినంత కాలం.. మీ టేక్-హోమ్ జీతం తగ్గదు అని కేంద్రం స్పష్టత ఇచ్చింది.

శాట్యుటరీ వేజ్ సీలింగ్ (Statutory Wage Ceiling) అంటే..
పీఎఫ్ (PF) వ్యవస్థకు ప్రస్తుతం రూ.15,000 చట్టబద్ధమైన వేతన పరిమితి ఉంది. అంటే.. యజమాని (Employer), ఉద్యోగి (Employee) ఇద్దరూ గరిష్టంగా రూ.15,000పై మాత్రమే పీఎఫ్ వాటాను చెల్లించాలి. అందులో 12% అంటే.. యజమాని, ఉద్యోగి చెల్లించే పీఎఫ్ వాటా ఒక్కొక్కరికీ రూ.1,800 మాత్రమే. ఒకవేళ రూ. 15,000 వేతన పరిమితి కంటే ఎక్కువ పీఎఫ్ చెల్లించాలనుకుంటే.. అది పూర్తిగా వాలంటరీ అవుతుంది. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం ఈ ప్రామాణిక పరిమితిలో ఎలాంటి మార్పు లేదు.
కొత్త లేబర్ కోడ్‌లలో వేతనాలు, అలవెన్సుల లెక్క
కొత్త కోడ్‌లు, వేతనాలు, అలవెన్సుల నిర్మాణంలో పారదర్శకతను తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉదాహరణతో లెక్క చూద్దాం..
- మొత్తం జీతం (Total Salary) = రూ.60,000
- బేసిక్ + డీఏ (Basic + DA) = రూ.20,000
- అలవెన్సులు (Allowances) = రూ. 40,000
కొత్త కోడ్స్ నిబంధన ప్రకారం అలవెన్సులు మొత్తం జీతంలో 50% కంటే ఎక్కువగా ఉంటే.. ఆ అదనపు భాగాన్ని చట్టబద్ధమైన లెక్కల కోసం వేతనానికి (Wages) జోడించాలి. ఈ ఉదాహరణలో అలవెన్సులు రూ.40,000 (మొత్తం జీతంలో 66.6%) ఉన్నాయి. కాబట్టి రూ.10,000 (40,000 - 30,000) అదనంగా వేతనానికి కలుస్తుంది. పీఎఫ్ లెక్కల కోసం వేతనం: రూ.20,000 (Basic) + రూ.10,000 (అలవెన్స్) = రూ.30,000 అవుతుంది.
టేక్ హోమ్ జీతం ఎందుకు తగ్గదు?
పీఎఫ్ లెక్కల కోసం వేతనం రూ.30,000గా పరిగణించినప్పటికీ, పీఎఫ్ వాటా మాత్రం చట్టబద్ధమైన పరిమితిని మించకూడదు. పీఎఫ్ వాటా ఎప్పుడూ రూ.15,000 వేతన పరిమితి పైనే లెక్కించబడుతుంది. యజమాని పీఎఫ్ వాటా = రూ.1,800, ఉద్యోగి పీఎఫ్ వాటా = రూ.1,800.
చట్టబద్ధమైన వేతన పరిమితి ₹15,000 వద్ద స్థిరంగా ఉన్నందున కొత్త లేబర్ కోడ్స్ అమలుకు ముందు, తర్వాత కూడా ఉద్యోగి యొక్క టేక్-హోమ్ జీతం అలాగే ఉంటుంది.
మొత్తంగా తెలిసిందేంటంటే.. మీరు స్వచ్ఛందంగా అధిక పీఎఫ్ చెల్లింపును ఎంచుకోనంత వరకు రూ.15,000 పీఎఫ్ సీలింగ్ కారణంగా కొత్త లేబర్ కోడ్స్ మీ నెలవారీ టేక్-హోమ్ జీతాన్ని తగ్గించవు. ఈ కోడ్‌లు ప్రధానంగా వేతన నిర్మాణంలో పారదర్శకతను పెంచుతాయి అంతే.


Click it and Unblock the Notifications